హైతీని భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 7.2గా నమోదైంది. సెయింట్ లూయిస్ డ్యూ సూడ్ నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఏర్పడింది. చాలా భవనాలు కుప్పకూలాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. దాదాపు 304 మంది చనిపోయారు. 18వందల మందికిపైగా గాయపడ్డారు.
హైతీలో నెల రోజులపాటు అత్యవసర స్థితిని ప్రకటించారు. పది కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు వచ్చినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఇంకా చాలామంది ఉంటారని భావిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. స్థానిక ఆస్పత్రులు గాయపడ్డవారితో నిండిపోయాయి.
హైతీకి సాయం చేసేందుకు అమెరికా ముందుకొచ్చింది. నష్టాన్ని అంచనా వేయడం.. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేందుకు యూఎస్ఏఐడీ కృషి చేస్తుందని ప్రకటించారు ఆదేశ అధ్యక్షుడు జో బైడెన్. హైతీలో 2010లో వచ్చిన భూకంపంలో 2 లక్షల మందికి పైగా మరణించారు.