లవ్ జిహాద్, బలవంతపు మత మార్పిడులకు వ్యతిరేకంగా ముంబైలో నిన్న వేలమంది హిందూ సంఘాల నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీనిర్వహించారు. ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషద్ వంటి సంస్థలకు చెందిన వీరి ర్యాలీతో నగర వీధులన్నీ కాషాయ రంగును సంతరించుకున్నాయి. హిందూ జన్ ఆక్రోష్ మోర్చా, సకల్ హిందూ సమాజ్ సంస్థల ఆధ్వర్యంలో సెంట్రల్ ముంబైలోని శివాజీ పార్క్ నుంచి పరేల్ లోని కామ్ గార్ మైదాన్ వరకు 4 కి.మీ. పొడవునా ఈ ర్యాలీ సాగింది.
లవ్ జిహాద్ కి, బలవంతపు మత మార్పిడులకు వ్యతిరేకంగా వీరు నినాదాలు చేశారు. బలవంతపు మత మార్పిడులను నిరోధించేందుకు పటిష్టమైన చట్టాలు తేవాలని డిమాండ్ చేశారు. మతం పేరిట జరుగుతున్న భూకబ్జాలను నివారించడానికి గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు, సీఎం ఏక్ నాథ్ షిండే నేతృత్వం లోని శివసేన వర్గానికి చెందిన నేతలు,కార్యకర్తలు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
లవ్ జిహాద్ కి సంబంధించి పలు రాష్ట్రాలు చట్టాలు తెచ్చాయని, వీటిని ప్రభుత్వం అధ్యయనం చేసి.. సరైన నిర్ణయం తీసుకుంటుందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గత డిసెంబరులో ప్రకటించారు.
సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వం ఈ విషయంలో నిర్ణయం తీసుకుని సంబంధిత చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ఈ ర్యాలీలో పాల్గొన్న సంఘాలు కోరాయి. యూపీ, మధ్యప్రదేశ్, హర్యానా, కర్ణాటక వంటి రాష్ట్రాలు అప్పుడే వీటి అమలుకు పూనుకొంటున్నాయి.