హైదరాబాద్ తో పాటు నగర శివారు ప్రాంతాల్లోని భూములు కాసులు కురిపిస్తున్నాయి. దీంతో భూ బకాసురులే కాదు.. రెవెన్యూ డిపార్ట్ మెంట్లో పనిచేస్తున్న ఉన్నతాధికారుల కన్ను కూడా భూములపై పడుతుంది. ఇక గుంటకాడ నక్కలా ప్రభుత్వ భూములను ఎలాగైనా కొట్టేయాలని కబ్జాకోరులు ఎదురుచూస్తుంటే.. వారికి ప్రభుత్వోద్యోగులు తోడై కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను మింగేస్తున్నారు.
తాజాగా వందల కోట్ల విలువైన 42 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా విక్రయించి మహేశ్వరం తహశీల్దార్ ఆర్‌పీ జ్యోతి అడ్డంగా బుక్కయ్యారు. దీంతో ఆమెతో పాటు, ఈఐపీఎల్ కన్‌స్ట్రక్షన్స్ యజమాని కొండపల్లి శ్రీధర్ రెడ్డిపై మహేశ్వరం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఇక వివరాల్లోకి వెళితే.. మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని 181 సర్వే నెంబర్లో 42 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మెహదీపట్నం నివాసి దస్తగిర్, ముజఫర్ హుస్సేన్ ఖాన్ మహేశ్వరంలోని 42 ఎకరాల స్థలానికి యజమానులని.. ఈ భూమిని 2005 అక్టోబరు 4న కొనుగోలు చేశామని చెబుతున్నారు. ఇక అదే ఏడాది నవంబర్ నెలలో మహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ కూడా చేశామని కోర్టుకు వాళ్లు విన్నవించారు.
ఇక ఇలా ఉంటే..లేట్ మహ్మద్ అక్బర్ అలీ ఖాన్, మహ్మద్ ఫారూఖ్ అలీ ఖాన్ లకు వారి తండ్రి అయిన లేట్ నవాబ్ హాజీ ఖాన్ నుంచి నోటి మాట ద్వారా సంక్రమించిన భూమిని తాము కొనుగోలు చేశామని కోర్టుకు తెలిపారు. అయితే, 2021 అక్టోబరు 10న శ్రీమతి ఖాదరున్నీసా, మహ్మద్ మునావర్ ఖాన్, మహేశ్వరం తహశీల్దారు శ్రీమతి ఆర్‌పీ జ్యోతి, బొబ్బిలి దామోదర్ రెడ్డి, బొబ్బిలి విశ్వనాథ్ రెడ్డి, ఎన్ సంతోష్ కుమార్, కొండపల్లి శ్రీధర్ రెడ్డిలు అక్రమ రీతిలో కొనుగోలు చేసి.. పాస్ పుస్తకాలు పొందారని, రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్ చేయించుకున్నారని వారు కోర్టుకు తెలిపారు.
మొత్తం విస్తీర్ణం 103. 35 ఎకరాలుండగా.. అందులో నుంచి 42.33 ఎకరాలను అక్రమంగా కొనుగోలు చేసి.. పాస్ పుస్తకాలను పొందారని కోర్టుకు వివరించారు. పైగా, ఈ భూమి మొత్తం నిషేధిత భూమి జాబితా అంటే 22-ఏ లో ఉందని కోర్టుకు తెలిపారు. దీంతో ఈ కేసులో ఈఐపీఎల్ కన్‌స్ట్రక్షన్స్ యజమాని కొండపల్లి శ్రీధర్ రెడ్డితో పాటు తహశీల్దారు ఆర్‌పీ జ్యోతితో సహా మిగతా ఐదుగురు అక్రమరీతిలో మోసపూరితంగా భూమిని తమ పేరిట నమోదు చేసుకున్నారని కోర్టుకు బాధితులు తెలిపింది. ఒక ప్రభుత్వోద్యోగి అయిన తహశీల్దారు అక్రమార్కులకు వంత పాడటం సబబు కాదని దస్తగిరి, ముజఫర్ హుస్సేన్‌లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో, ఈ ఏడుగురురిపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించడంతో మహేశ్వరం పోలీసులు ఎఫ్ఐఆర్‌ను నమోదు చేయడం జరిగింది. XVII అడిషనల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు.. ఐపీసీ సెక్షన్ 156 (2), సీఆర్‌పీసీ సెక్షన్లు 420, 166 కింద వీరిపై కేసులు నమోదయ్యాయి.