ఇరాన్ లో బాలికలు స్కూళ్లకు వెళ్లకుండా చూసేందుకు వందలాది విద్యార్థినులపై విషప్రయోగం జరిగింది. ముఖ్యంగా క్వామ్ సిటీలో కొందరు ఈ అమానుషానికి పాల్పడ్డారని ఇరాన్ డిప్యూటీ మంత్రి యోన్స్ పనాహి తెలిపారు. బాలికలకు విద్య అవసరం లేదని, స్కూళ్లను మూసివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారని ఆయన చెప్పారు. గత నవంబరు నుంచే అనేకమంది విద్యార్థినులు శ్వాస సరిగా తీసుకోలేక ఆసుపత్రి పాలయ్యారని ఆయన వెల్లడించారు.
టెహరాన్ కు దక్షిణాన ఉన్న ఈ సిటీలో విద్యార్థినులపై విష ప్రయోగం జరిగినట్టు ఆయన నిర్ధారించారు. అయితే ఈ దారుణానికి పాల్పడినవారినెవరినీ అరెస్టు చేసినట్టు సమాచారం లేదని పనాహి పేర్కొన్నారు. ఈ నెల 14 న పెద్ద సంఖ్యలో విద్యార్థినుల తలిదండ్రులు ఈ నగర విద్యాశాఖ కార్యాలయం వద్ద చేరుకొని అధికారుల నుంచి సంజాయిషీని కోరినట్టు టెహరాన్ వార్తా సంస్ధలు తెలిపాయి.
విష ప్రయోగానికి కారణాలపై ఇంటెలిజెన్స్, విద్యాశాఖ వర్గాలు ఆరా తీస్తున్నాయని ప్రభుత్వ అధికార ప్రతినిధి అలీ బహదూరీ వెల్లడించారు. ఇటీవలే ఈ సంఘటనపై న్యాయ విచారణకు ఆదేశించామని ప్రాసిక్యూటర్ జనరల్ మహమ్మద్ జఫర్ తెలిపారు.
మహిళలకు డ్రెస్ కోడ్ పై ప్రభుత్వం విధించిన ఆంక్షలను సవాలు చేస్తూ 22 ఏళ్ళ కుర్ద్ మహసా అమీనీ ఉదంతాన్ని ఈ సందర్భంగా వార్తా సంస్థలు ప్రస్తావించాయి. ఆమె ఉద్యమ నేపథ్యంలో ఇరాన్ లో పెద్దఎత్తున మహిళలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగారు. చివరకు డిసెంబరు 16 న పోలీసు కస్టడీలో అమీనీ మరణించింది.