యాక్సిడెంట్ వల్లో, వర్షం వల్లో ట్రాఫిక్ జామ్ అవ్వడం తెలుసు.. ప్రజలకు తరచూ ఎదురయ్యే సమస్యలే ఇవి. కానీ.. కోతుల వల్ల ట్రాఫిక్ జామ్ అవ్వడం చూశారా..? థాయ్లాండ్ లో జరిగింది. రద్దీగా ఉండే ప్రధాన రహదారిపైకి వచ్చిన కోతులు రెండు గ్రూపులుగా విడిపోయి తిట్టుకోవడం, కొట్టుకోవడం ప్రారంభించాయి.
మన తెలుగు సినిమాల్లో హీరోని కొట్టేందుకు వచ్చిన విలన్ బ్యాచ్ వరుసగా నిలబడినట్లు.. లైనుగా నిలబడి కొట్టుకున్నాయి. అసలే పిచ్చ కోపంలో ఉన్నాయని భావించారో ఏమోగానీ.. వాహనదారులు కూడా వాటిని తరమలేదు. అలాగే ఉండిపోయారు. దీంతో చాలాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
పాపులర్ టూరిస్ట్ ప్రాంతం ప్రాంగ్ శామ్ యోత్ లో ఈ సంఘటన జరిగింది. కరోనా నిబంధనల కారణంగా కోతులకు ఆహారం కరువైంది. దీంతో కాస్త తిండి దొరికినా దాని కోసం ఇవన్నీ కొట్టుకునే పరిస్థితి వచ్చింది.