అమెరికా విమానాశ్రయాల్లో వందలాది విమానాలు నిలిచిపోయాయి. సాంకేతిక లోపంతో ఇవన్నీ హఠాత్తుగా ఎయిర్ పోర్టులకే పరిమితమయ్యాయి . పైలట్లకు, ఇతర విమాన సిబ్బందికి ఎయిర్ పోర్ట్ ఫెసిలిటీ సర్వీసులు లేదా వాతావరణ సంబంధ సమాచారాన్ని, లేక మార్పుల గురించిన అంశాలను ఎప్పటికప్పుడు పంపే యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) లోని సిస్టం పని చేయకపోవడం ప్రధాన కారణంగా తెలుస్తోంది.
తాజా సమాచారాన్ని ఈ సిస్టం అప్ డేట్ చేయలేకపోతోందని సివిల్ ఏవియేషన్ రెగ్యులేటర్ వెబ్ సైట్ తెలిపింది. ‘నోటీస్ టు ఎయిర్ మిషన్స్’ సిస్టం విఫలమైంది అని ఈ సైట్ పేర్కొంది. ఇది మళ్ళీ ఎప్పుడు ప్రారంభమవుతుందన్నది తెలియలేదు.
అయితే దీన్ని పునరుద్ధరించేందుకు ఫైనల్ వ్యాలిడేషన్ చెక్స్ అన్నీ చేస్తున్నామని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సాంకేతిక లోపం కారణంగా అమెరికాలోకి రానున్న,లేదా ఈ దేశం నుంచి బయల్దేరనున్న సుమారు 400 విమానాల రాకపోకల్లో చాలా జాప్యం జరుగుతోంది.
ఫలితంగా వేలాది విమాన ప్రయాణికులు ఆయా విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. సాఫ్ట్ వేర్ లోపాలతో విమాన సర్వీసులను నిలిపివేశారని వార్తలందుతున్నాయి.