దేశం ఇంతగా అభివృద్ధి చెందుతున్నా ఇంకా ఆడపిల్ల, మగ పిల్లాడు అనే తేడా మారడం లేదు. మహిళలను ఇంకా పిల్లల్ని కనే మెషిన్లుగానే పరిగణిస్తున్నారు కొందరు మగ మహానుభావులు. చాలా చోట్ల ఇంకా మగ పిల్లాడి కోసం భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ముంబైలోని దాదర్ లో వెలుగులోకి వచ్చింది. ఓ 40 ఏళ్ల మహిళ తన భర్త కొడుకు కావాలనే ఆశతో ఎనిమిది సార్లు గర్భస్రావం చేయించుకోమని బలవంతం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు తన పెళ్ళి 2017లో జరిగిందని, ఉన్నత విద్యావంతులైన కుటుంబానికి ఆమెను ఇచ్చి వివాహం చేశారని, తన భర్త, అత్త న్యాయవాదులు, వాళ్ళ కూతురు డాక్టర్ అని వెల్లడించింది. ఆస్తిని కాపాడటానికి ఒక కొడుకు కావాలని భర్త చెప్పాడని, అందుకోసం తనను భర్త శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడని, కొడుకు పుట్టాలని కోరికతో విదేశాల్లో ఎనిమిది సార్లు అబార్షన్ చేయాల్సి వచ్చిందని బాధితురాలు తెలిపింది.
ఆమె 2009లో ఒక అమ్మాయికి జన్మనిచ్చిందని, 2011లో ఆమె మళ్లీ గర్భవతి అయ్యిందని, అప్పుడే తన భర్త ఆమెను డాక్టర్ వద్దకు తీసుకెళ్లి అబార్షన్ చేయించుకోమని బలవంతం చేశాడని ఆ 40 ఏళ్ల ఆమె చెప్పింది. అయితే ఇదంతా కొడుకు పుట్టడం కోసం తన భర్త ఆడుతున్న నాటకము అని ఆమెకు తెలియదట. నిందితుడు ప్రీ-ఇంప్లాంటేషన్ జన్యు నిర్ధారణ కోసం మహిళను బ్యాంకాక్ తీసుకువెళ్లాడు. 40 ఏళ్ళ ఆమె తనకు తెలియకుండానే అక్కడ గర్భధారణకు ముందు పిండం లింగాన్ని అంటే మగపిల్లాడా లేదా ఆడపిల్లా ? అనే పరీక్ష చేయించుకుంది. అంతేకాదు మగబిడ్డ కోసం చికిత్స, శస్త్రచికిత్స చేయించుకుంటున్నారు. మగబిడ్డకు జన్మనివ్వాలని ఆ మహిళకు దాదాపు 1,500 హార్మోన్లు, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇచ్చారట. ఇలాంటి పరీక్ష, చికిత్సలు భారతదేశంలో నిషేధించారు.తన అంగీకారం లేకుండానే ఈ చికిత్స జరిగిందని, తన జీవిత భాగస్వామి తన బిడ్డను ఎనిమిది సార్లు అబార్షన్ చేయమని ఒత్తిడి చేశారని బాధితురాలు చెప్పింది. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.