కొమురం భీం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లి ఇష్టం లేక కొడలిపై అత్త, మామలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. కోడలు గర్భిణి అని తెలిసి కూడా తనపై హత్యాయత్నం చేశారు. అన్యోన్యంగా ఉంటూనే వారిపై అనుమానం రాకుండా కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలిపి ఆమెతో తాగించారు. అనంతరం గర్భిణికి పురుటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే శిశువు పుట్టిన మరుసటి రోజే చనిపోయాడు.
దీనికి కారణం పురుగుల మందు తాగడం వలన అని వైద్యులు తెలిపారు. అటు కోడలి పరిస్థితి కూడా విషమంగానే ఉంది. దీంతో అసలు భాగోతం బట్టబయలు అయింది. కూల్ డ్రింక్ తాగిన తర్వాతే ఇలా అయిందని కవిత గుర్తించింది. అనంతరం అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు అత్త, మామ, భర్తపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. భర్త మహేందర్, అత్త విమల, మామ లహాన్ లను అరెస్ట్ చేశారు.
కాగా కొమురం భీం జిల్లా సిర్పర్ టీ మండలం కేశవ పట్నంకు చెందిన కవిత మహేందర్ లు ప్రేమించుకున్నారు. ఆ ప్రేమ కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో కవిత గర్భవతి అయింది. తనను పెళ్లి చేసుకోవాలని కోరగా.. మహేందర్ ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా చాలా రోజులు గడుస్తున్నా.. మహేందర్ ఇదే చెప్పుకుంటూ వస్తున్నాడు.
దీంతో కవిత తల్లిదండ్రులు పెద్దల పంచాయితీ పెట్టగా.. గత్యంతరం లేక మహేందర్ కవితను పెళ్లి చేసుకున్నాడు. ఇంటికి వచ్చిన కవితపై భర్త, అత్త, మామలు కర్కసత్వానికి పూనుకున్నారు. తమ చేతులకు మట్టి అంటకుండా ఉండేందుకు కవితతో మంచిగా ఉంటూనే.. ఆమెకు పురుగుల మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చారు. కానీ అది కాస్తా బెడిసి కొట్టి.. చివరికి కటకటాల పాలయ్యారు.