అనుమానం పెనుభూతం అంటారు. అలాంటి భూతాన్ని భార్య తన మనసులో మోసింది.ఆ కాపురం వీధిన పడింది.ఆ రోజు గొడవ హద్దుమీరింది. రోజూ గొడవపడ్డం అవసరమా ?! అనుకున్నాడు భర్త. అంతే..భార్య శవంగా మారింది. అనంతరం అడవిపాలైంది. భర్త జైలు పాలయ్యాడు. కర్ణాటక కారావార్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
స్థానికుల సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హలియాల్ తాలూకా తేరగావ్ గ్రామానికి చెందిన తుకారాం, శాంతకుమారికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. అయితే భర్తకు ఇతర మహిళలతో సంబంధాలున్నాయనే అనుమానంతో భార్య తరచూ గొడవపడుతుండేది.
అయితే ఆ రోజు రాత్రి ఈ విషయంపై గొడవ జరిగింది. దీంతో ఆగ్రహించిన భర్త ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం హత్య జరిగిన విషయం బయటకు రాకుండా శవాన్ని నీటి డ్రమ్ములో దాచి పెట్టాడు. ఒక వాహనాన్ని అద్దెకు తీసుకున్నాడు.
డ్రైవర్ రిజ్వాన్, అల్నవార్‌కు చెందిన సమీర్ పాంటోజీ సహాయంతో మృతదేహాన్ని రాంనగర్ అడవిలోకి తీసుకెళ్లాడు. నీటి డ్రమ్ము నుంచి శవాన్ని తీయడం చూసిన స్థానికులు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు.
దర్యాప్తు చేపట్టిన రాంనగర్ పోలీసులు.. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితులు తుకారాం, రిజ్వాన్, సమీర్ పాంటోజీ హాలియా సబ్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.