రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అనాజ్పూర్లోని ఓ వ్యక్తి అత్యంత దారుణానికి పాల్పడ్డాడు. మానవత్వం మరిచి భార్యనే కాదు నెలన్నర పసికందును కూడా మట్టుబెట్టాడు. తన రెండేళ్ల పాప ముందే ఈ దారుణానికి ఒడిగట్టాడు.
పోలీసుల వివరాల ప్రకారం…బండరావిరాలకు చెందిన కందికంటి నర్సింగ్ రావు కోటమ్మకు ముగ్గురు కుమార్తెలు, ఒక్క కుమారుడు ఉన్నారు.వీరిలో పెద్ద కుమార్తె లావణ్య(28)కు 2018లో అనాజ్పూర్ గ్రామానికి చెందిన ఏర్పుల ధనరాజ్తో వివాహం జరిపించారు.
వీరికి రెండేళ్ల కూతురు ఆద్య, 42 రోజుల కుమారుడు క్రియాన్ష్ ఉన్నారు. కుమారుడు పుట్టినప్పటి నుంచి లావణ్య బండరావిరాలలోని తన తల్లి ఇంట్లోనే ఉంటోంది.పెళ్లి జరిగిన నాటి నుంచి ఏర్పుల ధనరాజ్ తన భార్య లావణ్యతో గొడవ పడుతూ అదనపు కట్నం తీసుకురావాలని వేధించేవాడు.
ఈ విషయంమై రెండు మూడు సార్లు పెద్దల సమక్షంలో మాట్లాడి సముదాయించారు. అయినా ధనరాజ్ వైఖరిలో ఎటువంటి మార్పు రాలేదు. ఈ క్రమంలోనే బుధవారం ధనరాజ్ బండరావిరాల వెళ్లి కొడుకుకు టీకా వేయించాలనే కారణం చెప్పి.. భార్య లావణ్యను ఇద్దరు పిల్లలను అనాజ్పూర్ గ్రామానికి తీసుకొచ్చాడు.
అనాజ్పూర్ వచ్చిన తర్వాత కట్నం గురించి లావణ్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలోనే.. ఆమె తలపైబీర్ బాటిల్తో తలపై కొట్టి అనంతరం గొడ్డలితో నరికి హత్య చేశాడు. ‘నాన్నా.. నాన్నా.. అమ్మని కొట్టొద్దు. ప్లీజ్ నాన్నా తమ్మున్ని ఏం అనొద్దు’ అంటూ ఆ రెండేళ్ల పాప గుక్కపెట్టి ఏడ్చినా వినిపించుకోలేదు ఆ కసాయి.
కళ్ళముందే ఆ తండ్రి దుర్మార్గపు చర్యను చూసి ఆ చిన్నారి భీతిల్లింది. అక్కడే ఉంటే తననూ చంపేస్తాడేమోనన్న భయంతో బయటకు పరుగులు తీసింది. పక్కింటి వాళ్ల దగ్గరికి వెళ్లి ‘మమ్మీని డాడీ సీసాతో కొట్టాడు.
మొఖం మీద పొడిచాడు. తమ్ముడిని నీళ్ల ట్యాంకులో పడేశాడు’ అని జరిగిన ఘోరాన్ని చెప్పింది.గ్రామస్థులు వచ్చే సరికి ఎంత దారుణం జరగాలో అంతా జరిగిపోయింది.