భార్య భర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు మనస్పర్థాలు వస్తూనే ఉంటాయి. అయితే ఇంట్లో కూర కోసం వచ్చిన గొడవ ఏకంగా ఓ నిండు గర్భిణీ ప్రాణాలను బలితీసుకుంది. వివరాల్లోకి వెళ్తే కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లా చేళూరుకు చెందిన బాలచంద్ర వృత్తి రీత్యా ప్రైవేట్ బస్సు డ్రైవరుగా పనిచేస్తున్నాడు. మధుర అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి 11 నెలల బాలుడు సంతానం. ప్రస్తుతం ఆమె గర్భవతి. అయితే, లాక్‌డౌన్‌కు ముందు మధుర సమీపంలోని పుట్టింటికి వెళ్ళింది. బాలచంద్ర కూడా వెళ్లడానికి లేకుండా పోయింది. మొత్తానికి రెండు రోజుల క్రితం భార్య దగ్గకు వచ్చాడు.
అత్తగారింటికి వచ్చిన బాలచంద్ర పీకలదాక మద్యం సేవించాడు. భార్యకు చికెన్ కర్రీ వండమని చెప్పాడు. కోడికూర వండి భర్తకు వడ్డించింది. అసలు గొడవ ఇక్కడే మొదలైంది. మద్యం మత్తులో ఉన్న బాలచంద్ర కూరలో ఉప్పు తక్కువైందని గొడవ పెట్టుకున్నాడు. రాత్రి గదిలో మరోసారి ఇదే విషయమై గొడవపడి.. ఆవేశంలో మధుర గొంతు నులిమి చంపేశాడు. అయితే, ఆత్మహత్య చేసుకుందని అత్తింటివారిని నమ్మించే ప్రయత్నం చేశారు. విషయం చేళూరు పోలీసులకు తెలియడంతో.. బాలచంద్రను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.