భార్య ఒంటిపై శానిటైజర్ పోసి నిప్పంటించి హత్యకు పాల్పడ్డ ఓ వ్యక్తి గుట్టును అతడి పిల్లలే బయటపెట్టారు. ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదానికి గురైనట్లు పోలీసులను సైతం నమ్మించి తప్పించుకోవటానికి భర్త చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. తల్లి మృతిని జీర్ణించుకోలేని పిల్లలు తండ్రి నిజరూపాన్ని పోలీసులకు తెలిపారు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మేడ్చల్ పట్టణ సూర్యనగర్‌లో టి.నరేందర్, నవ్యశ్రీ(33) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు చందన, మేఘన ఉన్నారు. గత నెల 18వ తేదీన శివరాత్రి పర్వదినం రోజున నరేందర్ భార్య నవ్యశ్రీతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న శానిటైజర్ భార్యపై పోసి నిప్పంటించాడు. దీంతో నవ్యశ్రీ తీవ్రగాయాలపాలు కావడంతో ఆమెను ముందుగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించాడు.
విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు చికిత్స పొందుతున్న నవ్యశ్రీతో కలిసి ఆమె వాంగ్మూలాన్ని సేకరించగా తాను దీపం ముట్టిస్తూ ప్రమాదానికి గురైనట్లు చెప్పింది. అనంతరం పరిస్థితి విషమించటంతో ఆమెను మెరుగైన చికిత్స నిమిత్తం నగరంలోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఆమె మృతి చెందింది.
తల్లి మృతిని జీర్ణించుకోని ఇద్దరు పిల్లలు తమ బంధువులతో కలిసి మంగళవారం స్థానిక పోలీస్టేషన్ చేరుకుని తండ్రి నరేందర్ శానిటైజర్ పోసి నిప్పంటించి నవ్యశ్రీని హత్య చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితున్ని రిమాండ్‌కు తరలించారు.