గుండెలు మండుతున్నాయ్..గులాబీ జెండాలు చిరుగుతున్నాయ్.. కడుపులు రగులుతున్నాయ్.. కండువాలు కాలి బూడిదవుతున్నాయ్.. అనుకున్నది ఒకటి.. అవుతున్నది మరొకటి. హుజురాబాద్ పై గులాబీ బాస్ సంధించిన దళిత బంధు బోల్తా కొడుతోంది. అపర చాణక్యుడినని మురిసిపోతూ, అవసరం కొద్ది కేసీఆర్ విసిరిన రాజకీయ పాశుపతాస్త్రం అందరి ముందే వివస్త్రమవుతోంది. అస్యవ్యస్తంగా మారి చివరికి ఆయన మీదకే దూసుకెళ్తోంది.
దళిత బంధులో ఇంత దగానా? అంటూ హుజురాబాద్ దళిత బిడ్డలు గులాబీ దండుపై తిరగబడుతున్నారు. ఆరచేతిలో స్వర్గం చూపెట్టి , తీరా కొందరికే అవకాశం అంటున్న మెలికపై భగ్గుమంటున్నారు. అందరికీ దళిత బంధు.. లేదా.. బంద్ అంటే బంద్ అంటూ నినదిస్తున్నారు. నిన్నామొన్న నాలుగైదు చోట్ల మాత్రమే కనిపించిన ఈ నిరసనలు.. ఇప్పుడు హుజురాబాద్ అంతటా దావానలంలా మారాయి. తమకేదీ దళిత బంధు అంటూ ఊరూరా టీఆర్ఎస్ నేతలని దళితులు నిలదీస్తున్నారు. నడిరోడ్డుపై నిల్చోబెట్టి చీల్చి చెండాడుతున్నారు. ఓట్ల కోసం ఇన్ని కుట్రలా అంటూ కుతకులాడిపోతున్నారు.
హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే దళిత బంధు అని మొదటి నుంచి విపక్షాలు దుమ్మెత్తిపోస్తూనే ఉన్నాయి. కానీ కాదంటే కాదని ప్రగతి భవన్ సాక్షిగా కేసీఆర్ దళితులని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఊరికో నలుగురిని పిలిచి.. అందరికీ పంచుతానంటూ హామీ ఇచ్చారు. తీరా దళిత బంధు జీవోలో రూ. 500 కోట్లే ఉండటం.. దానికి తగ్గట్టే గ్రామంలో పది, ఇరవై కుటుంబాలకే పది లక్షలు ఇచ్చేందుకు సిద్ధం కావడంపట్ల మిగిలిన వారు.. ఉగ్రరూపం దాలుస్తున్నారు. దళితులంటే… అంత చులకనైపోయారా?.. మోసం చేయడం అంత సులువై పోయిందా అంటూ కడిగిపారేస్తున్నారు. అయితే పంచాయతీ ఆఫీసులు లేదంటే టీఆర్ఎస్ సర్పంచుల ఇళ్ల వద్ద యుద్ధభేరి మోగిస్తున్నారు. జాబితాలో తమ పేర్లు ఏవంటూ నిలదీస్తున్నారు. తామెందుకు అర్హులం కాదని ప్రశ్నిస్తున్నారు. మలి విడతలో ఇస్తామని అధికారులు చెబుతున్నా నమ్మడం లేదు. ఉప ఎన్నిక కోసమే పథకం తెచ్చారని తమకు తెలుసని… ఇస్తే అందరికీ ఇవ్వాల్సిందేనని తెగేసి చెబుతున్నారు.
Advertisements
గంటకో చోట వరంగల్ – కరీంనగర్ రహదారి స్తంభిస్తోంది. పది నిమిషాలకోసారి పరకాల- హుజురాబాద్ రోడ్డు నిరసనలతో రగులుతోంది. అక్కడా, ఇక్కడా అని లేదు. హుజురాబాద్ నియోజకవర్గ అంతటా ఇవే ధర్నాలు, రాస్తారోకోలు. పోలీసులు అడ్డుకుంటున్నా.. అధికారులు బుజ్జగిస్తున్నా ఎవరూ శాంతించడం లేదు. అందరి నోట ఒకేమాట.. అందిరికీ దళిత బంధు ఇవ్వాల్సిందేనని.. లేదంటే ఊరుకోబోమని. ఇదిలా ఉంటే మరికొన్ని గంటల్లో దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టాలని భావిస్తున్న గులాబీ శిబిరానికి.. తాజా పరిణామాలు తీవ్ర కలవరాన్ని కలిగిస్తున్నాయి. కేసీఆర్ జోక్యం చేసుకోకపోతే అసలుకే ఎసరు వచ్చేలా ఉందని ఆందోళనలో మునిగిపోయారు. కేసీఆర్ వాట్ నెక్స్ట్?