హుజూరాబాద్ ఉప ఎన్నికను మించి.. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో మరో ముఖ్యమైన అంశం ఏదీ లేకుండా పోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మధ్య ప్రెస్టేజ్ ఇష్యూ గా మారిన ఈ బైపోల్ లో ఎవరు గెలుస్తారన్నదానిపైనే రాష్ట్రమంతా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఉప ఎన్నిక ఈవీఎంలపై జరుగుతుందా లేక బ్యాలెట్ పేపర్‌పై జరుగుతుందా అన్నది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.
ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న నిరుద్యోగ యువత, ప్రైవేట్ టీచర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, వివిధ కుల సంఘాల నేతలు తామూ హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. దీంతో భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలోకి దిగబోతుండటం ఇప్పటికే ఖాయంగా కనిపిస్తోంది. ఫలితంగా ఈవీఎంలపై కాకుండా.. పేపర్ బ్యాలెట్‌పైనే ఉప ఎన్నిక జరిగొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల సంఖ్యను బట్టి ఈసీ నిర్ణయం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం, NOTAతో కలిపి 385 మందిని మించకుండా పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య ఉంటే EVMలను ఉపయోగిస్తారు. పోటీ చేసే అభ్యర్థులు 385 కంటే ఎక్కువ మంది ఉంటే మాత్రమే పేపర్ బ్యాలెట్‌లో ఎన్నికలు లేదా ఉప ఎన్నికలు నిర్వహిస్తారు.
ఇదిలా ఉంటే.. 2018లో పది మంది, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తొమ్మిది మంది అభ్యర్థులు (నోటా మినహా) హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. మరి ఉప ఎన్నికలో ఏం జరుగుతుందో చూడాలి.