రాజకీయాల్లో వాక్చాతుర్యం లేకపోతే నెట్టుకురావడం కష్టం. ఆకట్టుకునే ప్రసంగాలతో మాటల గారడీ చేయాలి. అప్పుడే నాలుగు ఓట్లు రాలతాయి. అభ్యర్థి ఉత్సవ విగ్రహంలా ఉంటూ పార్టీ నాయకులు అంతా నడిపిస్తే సీన్ రివర్స్ అయ్యే ఛాన్సులే ఎక్కువ. ప్రస్తుతం హుజూరాబాద్ లో అదే జరుగుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
హుజూరాబాద్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ కు ప్రెస్టేజ్ ఇష్యూ. కచ్చితంగా గెలిచి తీరాల్సిందే. లేకపోతే భవిష్యత్ పరిణామాలకు మూల్యం చెల్లించుకోక తప్పదు. బలమైన బీసీ నేత ఈటల రాజేందర్ ను ఢీకొట్టాలంటే.. మనం కూడా బీసీ నాయకుడ్నే దింపుదామని ఎన్నో వడబోతలు, చర్చల తర్వాత అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ ను నిలబెట్టింది గులాబీ పార్టీ. కానీ.. చక్రం తిప్పుతోంది మాత్రం మంత్రులు, ఎమ్మెల్యేలే. గెల్లు నామమాత్రపు పాత్రతోనే సరిపెట్టుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఎలాగైనా గెలిచి తీరాలని మంత్రులు, ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు. కుల సంఘాలతో చర్చలు, గ్రామ స్థాయిలో సమీకరణాలు మామూలుగా జరగడం లేదు. ఈ క్రమంలో అభ్యర్థి విషయంలో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా చెబుతున్నారు విశ్లేషకులు. అప్పుడప్పుడు ఉపన్యాసాలు ఇచ్చి.. తాను ఉద్యమ కారుడిని అని చెప్పుకుంటున్నారేగానీ.. హుజూరాబాద్ డెవలప్ పై తన విజన్ ఏంటో క్లారిటీ ఇవ్వడం లేదని అంటున్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎదురుగాలి వీయడంతో హుజూరాబాద్ లో ఛాన్స్ తీసుకోకూడదనే ఉద్దేశంతో టీఆర్ఎస్ లో ముఖ్య నాయకులే ముందుండి నడిపిస్తున్నారు. అయితే అభ్యర్థికి అంతగా ప్రాధాన్యత కల్పించకపోవడంతో ప్రజల్లోకి వేరేవిధంగా సంకేతాలు వెళ్తున్నాయని చెబుతున్నారు విశ్లేషకులు.
ఒక్కోసారి అభ్యర్థి కౌశిక్ రెడ్డా..? గెల్లు శ్రీనివాసా..? అనే సందేహం కూడా వస్తోందనే టాక్ నడుస్తోంది. ఎందుకంటే మంత్రులు, ఇతర నేతలు కౌశిక్ ను వెంటేసుకుని తిరుగుతున్నారు. పైగా గెల్లు శ్రీనివాస్ కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ కారణాలతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తంగా హుజూరాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి స్వేచ్ఛగా ప్రచారం చేసుకోలేకపోతున్నారని స్థానికంగా బలంగా వినిపిస్తోందని విశ్లేషణ చేస్తున్నారు రాజకీయ పండితులు.