దళిత బంధుతో వారి కుటుంబాల్లో వెలుగులు తీసుకొస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్.. పథకం ప్రకటించి నెల రోజులు తిరక్కుండానే చీకట్లు నింపుతున్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని గ్రామాల్లో దళిత కుటుంబాల మధ్య చిచ్చుపెడుతున్నారు. పైలట్ ప్రాజెక్ట్ కాబట్టి హుజురాబాద్‌లోని దళిత కుటుంబాలన్నింటికీ దళిత బంధు అందిస్తానని.. అవసరమైతే మూడు వేల కోట్ల రూపాయాలైనా సరే అక్కడ ఖర్చుపెడతానని తొలుత చెప్పారు కేసీఆర్. కానీ ఖజానా అందుకు సహకరించకపోవడంతో కోతపెట్టారు. రూ. 500 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడిదే హుజురాబాద్‌లో దుమారం రేపుతోంది. దళిత కుటుంబాల మధ్య చిచ్చు రగుల్చుతోంది.
ఈ నెల 16న హుజురాబాద్‌లో దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధం కావడంతో.. గ్రామాల్లో లబ్దిదారులను ఎంపిక చేసేపనిలో పడ్డారు అధికారులు. అయితే ఇందుకోసం కొన్ని కుటుంబాలనే జాబితాలోకి తీసుకుంటున్నారు. దీంతో మిగిలిన వారు భగ్గుమంటున్నారు. భూములు, ఆస్తులు ఉన్నవారి పేర్లు జాబితాలో చేర్చి.. ఏమీ లేని వారికి మొండిచేయి చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొన్నిచోట్ల అధికారులు లబ్ధిదారులతో కుమ్మక్కయి.. ఒక్కో కుటుంబంలో ఏకంగా ఇద్దరికి కూడా దళిత బంధు ఇచ్చారని మండిపడుతున్నారు. ఇస్తే అందరికీ ఒకేసారి దళిత బంధు ఇవ్వాలని లేదంటే..మొత్తం పథకాన్నే బంద్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో ఈ విషయంపై ఇప్పటికే దుమారం రేగుతోంది. జాబితాలో తమ పేర్లు లేనివారు ధర్నాలకు దిగుతున్నారు. కుటుంబాలతో సహా రోడ్డెక్కి బైఠాయిస్తున్నారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అందరికి ఇస్తానని ఆశపెట్టి, తీరా కొందరికేనంటూ చెప్పి దళితుల జీవితాలతో ఆడుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఎవరిని చంపడానికి ఈ పథకాన్ని తీసుకు వస్తున్నారని నిలదీస్తున్నారు.