బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న చనిపోతే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపకపోవడం దారుణమన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. మంగళవారం మహబూబ్ నగర్ లోని టీటీడీ కళ్యాణ మండపం చౌరస్తాలో ప్రజాగోస – బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్ జరిగింది. దీనికి హాజరైన ఈటల.. కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. సాయన్నకు అధికారిక అంత్యక్రియలు జరపకపోవడం.. దళితులందరినీ అవమానించడమేనని అన్నారు.
ఇప్పటిదాకా కేసీఆర్ ఒక్క దళితునికి కూడా జాగా ఇవ్వలేదని మండిపడ్డారు. దేశంలోనే అత్యంత త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం అని చెబుతున్నారని.. కనీసం జిల్లాల ఉద్యోగులకు జీతాలు టైమ్ కి చెల్లించే పరిస్థితి లేదన్నారు. అమరులు కోరుకున్న తెలంగాణ ఇది కాదన్న ఈటల.. నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తారని కేసీఆర్ ను నిలదీశారు. రైతులు, మహిళలు, నిరుద్యోగుల కళ్లల్లో మట్టి కొట్టారని విమర్శించారు.
ధరణి పేరుతో పేదల కొంప ముంచారని అన్నారు. పచ్చి ఫ్యూడల్ భావజాలాన్ని అమలు చేసే దశలోనే పేదలకు భూమి దక్కకుండా చేశారని విమర్శించారు. రైతులకు రుణ మాఫీ చేస్తానని చేయలేదని.. దానివల్ల అన్నదాతలపై రుణాలు ఎగవేతదారులుగా ముద్రపడిందని మండిపడ్డారు. బడ్జెట్ లో కళ్యాణ లక్ష్మి, పింఛన్లు, సంక్షేమ పథకాలకు 30 వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారని తెలిపారు. కానీ, ఎక్సైజ్ నుంచి ప్రభుత్వం పిండుతున్న మొత్తం రూ.45 వేల కోట్లకు పైనే ఉందని వివరించారు.
పేదోడిని తాగుబోతును చేస్తూ.. అటు కళ్యాణ లక్ష్మికి డబ్బులిచ్చి.. ఇటు తాళి బొట్టు తెంపుతున్నారంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఈటల. 2024లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తనను మాట్లాడనివ్వలేదని.. పేదల బతుకులు మారుతాయని అనుకుంటే.. చిన్న చిన్న భూములున్న రైతులను బిచ్చగాళ్ళుగా మార్చారని ఆరోపించారు రాజేందర్.