కరోనా పేరుతో హుజురాబాద్ ఉప ఎన్నికను వాయిదా వేయించటంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సక్సెస్ అయ్యింది. పండుగలయ్యేంత వరకు ఎన్నికలు వద్దని రాష్ట్ర ప్రభుత్వం కోరటంతోనే షెడ్యూల్ విడుదల చేయటం లేదని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే ప్రకటించింది. దీనిపై ప్రతిపక్షాల నుండి తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. బీజేపీ కేంద్రనాయకత్వంతో కేసీఆర్ మాట్లాడి చక్రం తిప్పారన్న ప్రచారం కూడా జరిగింది.
అయితే, ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘంపై కూడా ఆరోపణలు రావటంతో… హుజురాబాద్ లో పరిస్థితిపై ఎన్నికల సంఘం ప్రత్యేక నివేదిక తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. హుజురాబాద్ లో గత రెండు నెలలుగా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఉండే పరిస్థితులే ఉన్నాయి. అక్కడ కరోనా కేసులు, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కొత్త పథకాలు, విడుదల చేస్తున్న అభివృద్ధి నిధులు… ఇలా అన్ని అంశాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది.
అన్ని అంశాలపై పూర్తి స్థాయి నివేదిక తర్వాత సెప్టెంబర్ నెలాఖరులో షెడ్యూల్ ప్రకించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 12- 15వ తేదీల్లో ఏదో ఒకరోజు పోలింగ్ ఉండే ఛాన్స్ ఉందని సమాచారం. నిజానికి వచ్చే ఏడాదిలో ఎన్నికలు నిర్వహించేలా టీఆర్ఎస్ పార్టీ చక్రం తిప్పిందన్న వార్తల నేపథ్యంలో ఎన్నికల సంఘం అడుగులు ఆసక్తికరంగా మారాయి.