మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎపిసోడ్ తర్వాత హుజురాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్‌లో ఆధిపత్యపోరు కనిపిస్తోంది. ద్వితీయ శ్రేణి నాయకులంతా నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి చేరిపోయారు. ఒకరికి తెలియకుండా ఒకరు ప్రెస్‌మీట్‌లు నిర్వహిస్తూ.. ఈటలపై విమర్శలు చేస్తూ అధిష్టానం దృష్టిలో పడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అదృష్టవశాత్తు హుజురాబాద్ ఎమ్మెల్యే టికెట్ దక్కినా దొక్కొచ్చేమోనన్న ఆశతో ఎవరికి వారు తమ ప్రత్యేకతను చాటుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈక్రమంలో తాజాగా బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం నిర్వహించిన మీడియా సమావేశంలో వేదికపైనే టీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగడం హాట్ టాపిక్‌గా మారింది.
టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్ హుజురబాద్ టౌన్ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్‌ను సమావేశంలోనే కడిగిపారేశాడు. ప్రెస్‌మీట్ నాకు తెలియకుండానే పెడతావ్.. రేకులు నువ్వే వేయిస్తవ్.. మేం లేమా ఇక్కడ.. పిలవాలే మమ్మల్నిగుడా అంటూ ఫైర్ అయ్యాడు. ఇంత జరుగుతున్న మీడియా సమావేశం నిర్వహిస్తున్న వకుళాభరణం కృష్ణమోహన్ రావు గానీ, మాటలు పడుతున్న టౌన్ అధ్యక్షుడు గానీ కిమ్మనలేకపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు స్థానికంగా వైరల్‌గా మారింది.
ఇదిలా ఉంటే.. హుజురాబాద్ నుంచి టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న వారిలో వకుళాభరణం కృష్ణమోహన్ రావు కూడా ఉన్నారు. దీంతో ఈ వేదికపై ఈటలను ఓ రేంజ్‌లో టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.