తిరుగుబాటు ఎలా ఉంటుందో చూపించిన గడ్డ అంది. రాజకీయ చైతన్యం నరనరాన నూరి పోసుకున్న ఓటర్లు అక్కడి జనం. సిమెంట్ ఫాక్టరీలకు, సాగునీటి వనరులకు కొదవే లేదు. ఆర్థిక వనరులకు ఏమాత్రం లోటు ఉండదు. కానీ అక్కడ కూడా ఓ పెద్ద సమస్య అన్ని పార్టీలకు గుబులు రేపుతోంది. ముఖ్యంగా కేసీఆర్, ఉత్తమ్‌కు ఇప్పుడీ సమస్యే నిద్ర పట్టనీయటం లేదు.
హుజూర్ నగర్ నియోజకవర్గం. ఇక్కడ మెజార్టీ ప్రజల జీవనాధారం వ్యవసాయం. నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా వచ్చే సాగు నీటితో ఇక్కడ పండిన పంటలు రైతులకు సిరులు కురిపిస్తాయి. హుజూర్‌నగర్ అభివృద్ధిలో మాత్రం వెనుకబడివుంది. దీనిపై ఎన్నికల వేళ అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. హుజూర్ నగర్ టౌన్‌లో రోడ్లు అస్త్యవ్యస్థంగా తయారయ్యాయి. హుజూర్ నగర్ నుంచి మిర్యాలగూడ వరకు నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ ప్రతిపాదన అటకెక్కింది. కోదాడ, హుజూర్ నగర్ మధ్య రహదారి గుంతల మయంగా మారింది.ఇప్పుడీ రహదారులపై ప్రయాణం అంటేనే వాహనదారులు హడలెత్తిపోతున్నారు.
హుజూర్ నగర్ బస్టాండ్ అధ్వాన్నంగా తయారై౦ది. టౌన్‌లో ఇరుకు రోడ్లతో జనం ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజి వ్యవస్థ సరిగా లేకపోవడంతో పట్టణం అంథకారంగా తయారైంది. మున్సిపల్ సిబ్బంది మురికి కాల్వలు కూడా శుభ్రం చేయకపోవడంతో పట్టణవాసులు రోగాల బారిన పడుతున్నారు. ఇక పల్లెల్లో పరిస్థితి మరీ దారుణం. ఇప్పటికీ కొన్ని గ్రామాలకు రోడ్లు లేవు.దీంతో బస్సులు రాని పల్లెలు బోలెడున్నాయి. కృష్ణా జలాలు రాని గ్రామాలు మరికొన్ని. మొన్నటి వర్షాలకు రోడ్లన్నీ గుంతలమయంగా మారినా మెరుగులు దిద్దే నాధుడే లేడు.
2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు చాలా నెరవేరనే లేదు. హుజూర్ నగర్‌లో మినీ బస్సు డిపో నిర్మాణం ఊసే లేదు. పాలిటెక్నిక్ కాలేజ్, మినీ ట్యా౦క్ బండ్ నిర్మాణ హామీ అటకెక్కింది. ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం స్థల పరిశీలన వద్దే ఆగిపోయింది. హుజూర్ నగర్ టౌన్‌లో పేరుకే 100 పడకల ఆస్పత్రి అయినా సిబ్బంది కొరత వేధిస్తోంది.ఆస్పత్రిలో 30 మంది డాక్టర్లు ఉండాల్సి ఉండగా కేవలం ఆరుగురు డాక్టర్లే ఉండడంతో రోగులకు సరైన వైద్యం అందడం లేదు.
ఇక తెలంగాణ, ఏపీ సరిహద్దులో మట్టపల్లి దగ్గర నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణం నిధులు లేక పనులు నిలిచిపోయాయి. హుజూర్ నగర్ బైపాస్ రోడ్ నిర్మాణం అతీగతీ లేకుండా పోయింది. ఇక హుజూర్ నగర్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మోడల్ కాలనీకి మోక్షం లభించడం లేదు. ఈ కాలనీ పూర్తయితే 4 వేల మంది పేదలు లబ్ధిపొందుతారు. ప్రస్తుతం 4 వేల ఇండ్ల నిర్మాణాలు జరిగినా అర్హులకు ఇళ్లు ఇచ్చేందుకు పాలకులకు చేతులు రావడం లేదు. దీంతో కట్టిన ఇండ్లన్నీ శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. వందల కోట్ల నిధులు వృధా అయ్యాయే కానీ, పేదలకు ఒరిగిందేమీ లేదు. మోడల్ కాలనీపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయంటున్నారు స్థానికులు.
ఇక సిమెంట్ నిక్షేపాలకు అనువైన ప్రదేశం ఈ ప్రాంతం. ఇక్కడ సుమారు 8 అతి పెద్ద సిమెంట్ పరిశ్రమలున్నాయి. అయినా ఉపాధి దొరకదనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. డెయిలీ లేబర్స్ , సెక్యూరిటీ ఉద్యోగాలు తప్ప చదువుకున్న యువతకు ఉద్యోగాలు దొరకని పరిస్థితి. దీంతో ఉద్యోగాల కోసం యువత వలస బాట పడుతున్నారు. పాలకులు చొరవ తీసుకోకపోవడమే ఈ పరిస్థితికి కారణమంటున్నారు స్థానిక యువకులు.
మొత్తానికి హుజూర్ నగర్ అభివృద్ధి విషయంలో ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో లేకపోవడంతోనే ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదని ఉత్తమ్ మద్దతుదారులు చెబుతున్నారు. అతని పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదనే వాదనాలూ కొంతమంది పబ్లిక్ నుంచి వినబడుతున్నాయి. ఇక్కడ తాజాగా ఉప ఎన్నికలు రావడంతో రాజకీయ నాయకులంతా మరోసారి అభివృద్ధి నినాదాన్ని ఎత్తుకున్నారు. హుజూర్ నగర్ ప్రజలకు హామీల జల్లు కురిపిస్తున్నారు. మరి గెలిచిన నాయకులు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారో ? లేక మళ్లీ మొదటికే వస్తారో.. చూడాలి మరీ.