అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో మృతి చెందిన నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ కుటుంబానికి జీహెచ్‌ఎంసీ పరిహారం ప్రకటించింది. రూ.8 లక్షల పరిహారం ప్రకటిస్తూ జీహెచ్‌ఎంసీ సమావేశంలో మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు బాలుడి కుటుంబానికి నెల రోజుల వేతనాన్ని ఇవ్వనున్నట్లు జీహెచ్‌ఎంపీ పరిధిలోని కార్పొరేటర్లు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
మంగళవారం జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రదీప్ కుటుంబానికి పరిహారం అందించే విషయం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా రూ.8 లక్షల పరిహారం ఇవ్వాలని కౌన్సిల్ నిర్ణయించింది. దీంతో తాము కూడా నెల రోజుల వేతనం ఇస్తామని కార్పొరేటర్లు అందరూ ముందుకొచ్చారు. ప్రదీప్ కుటుంబానికి పరిహారం ప్రకటించాలనే డిమాండ్లు గత కొద్దిరోజులుగా పెద్దఎత్తున వినిపిస్తోన్నాయి. జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యం వల్లే ప్రదీప్ చనిపోయాడని, కుక్కలను కట్టడి చేయడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నుంచి తీవ్ర విమర్శలొస్తున్నాయి.
ప్రదీప్ కుటుంబానికి పరిహారం ప్రకటించాలని డిమాండ్లు వస్తున్న క్రమంలో జీహెచ్‌ఎంసీ సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. ప్రదీప్ ఘటన మరువకముందే హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో కుక్కల దాడి ఘటనలో చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వీధి కుక్కలను కట్టడి చేయడంపై జీహెచ్‌ఎంసీ దృష్టి పెట్టింది. నగరవ్యాప్తంగా వీధి కుక్కలను పట్టుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు అనేక కుక్కలను పట్టుకుని ప్రత్యేక కేంద్రాలకు తరలించారు.
ప్రదీప్ ఘటనను హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ జరుపుతోంది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వీధి కుక్కల కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే దానిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రదీప్ చనిపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని, ఇది ప్రభుత్వ హత్యేనని సీరియస్ అయింది. ప్రదీప్ కుటుంబానికి ఎంత పరిహారం ప్రకటించాలనే విషయంపై ఆదేశాలు జారీ చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఈ కేసు తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా జీహెచ్‌ఎంసీ పరిహారం ప్రకటించింది.