హైదరాబాద్ నగరం మరోసారి క్రికెట్ సమరానికి వేదిక కానుంది. ఈ నెల 18న భారత, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. మధ్యాహ్నం 1.30 నుంచి 5 గంటల వరకు ఫస్ట్ ఇన్నింగ్స్ జరగగా, 5.45 నుంచి రెండో ఇన్నింగ్స్ ప్రారంభం కానుంది. రాత్రి 9.15 నిమిషాల వరకు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కి సంబంధించిన టిక్కెట్ల విక్రయం జనవరి 13నుంచి జరగనుందని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్ తెలిపారు.
నాలుగు సంవత్సరాల తరవాత ఉప్పల్ స్టేడియంలో వన్డే మ్యాచ్ జరుగుతోంది. జనవరి 18 మ్యాచ్ కోసం కేవలం ఆన్ లైన్ లో (పెటియం) మాత్రమే…ఆఫ్ లైన్ టికెట్ అమ్మడం లేదని HCA అధికారులు స్పష్టం చేశారు. మ్యాచ్ చూడడానికి వచ్చే వారు ఫిజికల్ టికెట్ తప్పనిసరి అని సూచించారు.
ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలలో జనవరి 15 నుండి 18 వరకు ఉదయం 10 నుండి 3 గంటల వరకు ఫిజికల్ టికెట్ కలెక్ట్ చేసుకోవాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్ తెలిపారు. బ్లాక్ టికెట్ అమ్మకాలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని అజారుద్దీన్ తెలిపారు. పార్కింగ్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని, ఆన్ లైన్ టికెట్ల అమ్మకాలు జనవరి 13 నుండి 16 వరకు విడతల వారీగా జరుగుతాయని తెలిపారు.
జనవరి 13న 6వేల టికెట్లు, జనవరి 14వ తేదీన 7వేల టికెట్లు విక్రయించగా మరో 7 వేల టిక్కెట్లను జనవరి 15న విక్రయించనున్నామని అజారుద్దీన్ తెలిపారు. జనవరి 16న మిగతా టిక్కెట్ల విక్రయం చేస్తామని వెల్లడించారు.స్టేడియం కెపాసిటీ 39,112 ఉండగా 29417 టికెట్స్ అమ్మకానికి ఉంచుతున్నట్లు అజార్ తెలిపారు. కంప్లమెటరి టికెట్స్ 9695 ఇస్తున్నట్లు కూడా అజార్ వెల్లడించారు. ఆన్‌లైన్లో టికెట్ తీసుకునేవారు కేవలం 4టికెట్లు మాత్రమే తీసుకోవాలని సూచించారు.
జనవరి 14 న న్యూజిలాండ్ టీమ్ హైదరాబాద్లో ల్యాండ్ అవ్వనుంది. జనవరి 15వ తేదీ సాయంత్రం ప్రాక్టీస్ చేయనుంది.ఈ నెల 18 న మ్యాచ్‌న తొలి వన్డే మ్యాచ్ ఉప్పల్‌లో జరగనుంది.కివీస్‌తో జరిగే తొలి వన్డే హైదరాబాద్‌లో జనవరి 18న జరగనుంది. రెండో మ్యాచ్ జనవరి 21న, మూడో మ్యాచ్ జనవరి 24న జరగనుంది.
గత ఏడాది హైదరాబాద్‌లో భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఓ క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు ముందు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. టిక్కెట్ల విక్రయంలో అనేక అవకతవకలు జరిగాయి. క్రికెట్ అభిమానులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులతో లాఠీ దెబ్బలు తిన్నారు. టిక్కెట్ల కోసం గంటల కొద్దీ భారీ క్యూలైన్లలో నిల్చున్నారు. తీవ్ర నిరాశకు గురయ్యారు. పోలీసులు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య సమన్వయం కొరవడడంతో అభిమానులకు అవస్థలు తప్పలేదు. ఆ సమయంలో అజారుద్దీన్ వ్యవహార శైలిపై పలు విమర్శలు వచ్చాయి. ఓ రాజకీయ పార్టీకి చెందిన నేత ఏకంగా మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేశారు. అజారుద్దీన్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
గతంలో జరిగిన గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఈసారి మ్యాచ్ నిర్వహణ మరింత పటిష్టంగా జరగనున్నట్లు తెలుస్తోంది. పోలీసులు, హెచ్‌సీఏ అధికారులు సమన్వయంతో వ్యవహరించి అభిమానులకు టిక్కెట్లు అందించే విషయంలో పారదర్శకత ప్రదర్శిస్తారని పలువురు ఆశిస్తున్నారు.