‘విజయవాడలో విజయవాడ వాళ్లు మాత్రమే ఉంటారు. నల్గొండలో నల్గొండ వాళ్లు మాత్రమే ఉంటారు. గుంటూరులో గుంటూరు వాళ్లు మాత్రమే ఉంటారు. కానీ హైదరాబాద్ లో అన్ని ప్రాంతాల వాళ్లు ఉంటారు’.. అని ఏదో సినిమా లో హీరో చెప్పే డైలాగు మీ అందరికీ గుర్తుందా..? అవును హైదరాబాద్ అందరిది.. ఇక్కడ అన్ని ప్రాంతాల వాళ్లు ఉంటారు.
ఎంతో మందికి జీవనాధారం చూపించే నగరం హైదరాబాద్.. అందరు మెచ్చినది, నచ్చినది హైదరాబాద్… ఇక్కడ బతికేయడం చాలా ఈజీ అంటున్నారు అందరు. అవును దేశంలోని ఇతర నగరాలతో పోల్చితే భాగ్యనగరంలో బతికేయడం చాలా సులభమని సర్వేలు తెలుపుతున్నాయి.
రాజధాని నగరంలో ఎందరో సంపన్నులున్నారు..అలాగే అంతమంది సామాన్యులున్నారు. నవాబుల దగ్గర్నుంచి..గరీబులు దాకా..హైదరాబాద్ నగర జీవన శైలి ఓ అద్భుతం. ఈ విశ్వనగర వైవిధ్యానికి ఓ తాజా సర్వే సైతం అద్దం పట్టిందిప్పుడు. ప్రపంచవ్యాప్తంగా ఆయా నగరాల్లోని జీవన వ్యయాన్ని చెప్తూ ‘మెర్సర్స్ 2022 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే’ వివరాలు విడుదలయ్యాయి.
ముంబై టూ కాస్ల్టీ…
ప్రవాసులకు సంబంధించి వెల్లడైన ఈ ర్యాంకుల్లో భారత్‌లో ముంబై చాలా ఖరీదైన నగరమని తేటతెల్లమైంది. వేరే చోట్ల నుంచి వచ్చేవారికి ఇక్కడ జీవన వ్యయం ఇతర భారతీయ నగరాలతో పోల్చితే ఎంతో ఎక్కువని స్పష్టమైంది. ఇదే క్రమంలో అనేక అంశాల్లో హైదరాబాద్ ఉత్తమమని, అన్ని వర్గాలకు అనువైన జీవనశైలి భాగ్యనగరం సొంతమని కూడా సర్వే తెలియజేసింది.
హౌజింగ్‌లో భాగ్యనగరమే ఫేవరేట్
భారత్‌లో హౌజింగ్ విషయంలో అన్ని నగరాల కంటే హైదరాబాద్ ఆకర్షణీయంగా ఉందని మెర్సర్ తమ సర్వేలో తేల్చిచెప్పింది. ఇక్కడి సరసమైన ధరలు అన్ని వర్గాలకు అందుబాటులో ఉంటున్నాయని పేర్కొన్నది. అందుకే దేశీయ హౌజింగ్ మార్కెట్‌లో హైదరాబాదే ఫేవరేట్‌గా ఉందన్నది. తమ పరిశీలనలో అందరికీ చౌకగా హైదరాబాద్‌లోనే ఇళ్లు లభిస్తాయని స్పష్టమైనట్టు మెర్సర్ చెప్పింది. అద్దెల్లో ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాలు దేశంలోనే చాలా ఖరీదైనవిగా ఉన్నాయి.
హైదరాబాద్ వైపు కార్పొరేట్లు
జీవన వ్యయంతోపాటు నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండటంతో ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు దేశంలో హైదరాబాద్ వైపే చూస్తున్నాయని మెర్సర్ తెలియజేసింది. భారత్‌కు ఆర్థిక రాజధానిగా ముంబై ఉన్నందున ఎన్నో బహుళజాతి సంస్థలు అక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నాయని చెప్తూనే.. ద్రవ్యోల్బణం దృష్ట్యా హైదరాబాద్, చెన్నై, పుణె వంటి ప్రత్యామ్నాయ నగరాల పైనా అంతే స్థాయిలో దృష్టిసారిస్తున్నాయని పేర్కొనడం గమనార్హం.
మెర్సర్ సర్వే ముఖ్యాంశాలు
జీవన వ్యయంలో ప్రపంచంలోని టాప్-10 ఖరీదైన నగరాల్లో నాలుగు స్విట్జర్లాండ్‌కు చెందినవే. ఐదు ఖండాల్లోని 227 నగరాల్లో ఈ ఏడాది మార్చిలో సర్వే జరిగింది. హౌజింగ్, రవాణా, ఆహారం, దుస్తులు, గృహోపకరణాలు, వినోదం తదితర 200లకు పైగా అంశాల్లో ఖర్చుల ఆధారంగా నగరాలకు ర్యాంకులు ఇచ్చారు.
ముంబైతో పోల్చితే హైదరాబాద్, చెన్నై, పుణె, కోల్‌కతాల్లో బస ఖర్చులు 50 శాతానికి పైగా తక్కువే
హైదరాబాద్, చెన్నైల్లో విద్యుత్తు, ఫోన్ల నిర్వహణ, గృహ సంబంధిత వినియోగాల వ్యయం తక్కువ.
ముంబైలో ఎక్కువ
సినిమా టిక్కెట్ల రేట్లు హైదరాబాద్‌లోనే అత్యంత తక్కువ. ముంబైలో ఇది ఎంతో ఖరీదైన విషయం
దేశంలోని అన్ని నగరాల్లో పెట్రోల్ వ్యయం అధికం. కొత్త కార్ల ధరలు, వాటి నిర్వహణ వ్యయం కూడా ఎక్కువే
ఇతర నగరాలతో పోల్చితే పాలు, బ్రెడ్, కూరగాయల వంటి నిత్యావసరాల ధరలు కోల్‌కతాలో చౌక. ముంబై, ఢిల్లీల్లో చాలా ఖరీదు.