హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కోణంలో కొత్త మలుపు చోటుచేసుకుంది. ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేసిన పాతబస్తీకి చెందిన అబ్దుల్ కలీమ్ అనే వ్యక్తిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో జాహీద్‌తో పాటు ముగ్గురిని గతంలోనే అరెస్ట్ చేశారు. అయితే నిందితుడు జాహీద్‌కు రూ.40 లక్షలు అబ్దుల్ కలీమ్ ఆర్ధిక సాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
కలీమ్ ఇచ్చిన రూ.40 లక్షలతో జాహీద్ కార్లు, బైకులు కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. హ్యాండ్ గ్రానైట్లతో పేలుళ్లకు జాహీద్ ముఠా కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. హ్యాండ్ గ్రానైట్లు పెట్టి పేల్చడానికి కుట్ర పన్నారని, దసరా ఉత్సవాలతో పాటు హైదరాబాద్‌లో జరిగే ఉత్సవాల్లో పేలుళ్లకు కుట్ర చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
గతంలోనే ఈ పేలుళ్ల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఇప్పటికే హైదరాబాద్ పేలుళ్ల కుట్రపై ఎన్‌ఐఏ విచారణ చేపడుతోంది. హైదరాబాద్‌లో నరమేధం సృష్టించేందుకు అబ్ధుల్ జాహీద్, మహ్మద్ సమియుద్దీన్, మాస్ హసన్ ఫారూఖ్ అనే ముగ్గురు ఉగ్రవాదులు కుట్ర పన్నారు. అయితే ఈ కుట్రను పోలీసులు ముందే పసిగట్టి భగ్నం చేశారు.
హైదరాబాద్‌లో రద్దీగా ఉండే ప్రాంతాలతో పాటు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆఫీసులను పేల్చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కీలక నిందితుడిగా ఉన్న జాహీద్‌కు ఐఎస్‌ఐతో సంబంధాలు ఉండగా.. పాకిస్తాన్ నుంచి అతడికి నిధులు అందినట్లు గుర్తించారు.