ఆషాడం మొదలవుతుందంటే భాగ్యనగర వాసులకు కొత్త ఉత్సాహం పుట్టుకొస్తుంది. అది ఏంటంటే బోనాల జాతర.. ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించే ఆషాడ బోనాలకు ముహూర్తం ఖరారైంది. హోంమంత్రి మహమూద్ అలీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి బోనాల వేడుకపై సమీక్ష నిర్వహించారు. తరువాత తేదీలను ఖరారు చేశారు.
ఈ నెల 30న గోల్కొండ బోనాలు ప్రారంభం కానున్నాయి. జులై 17న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు, 18న రంగం కార్యక్రమం నిర్వహించనున్నారు. జులై 24న భాగ్యనగర బోనాలు, 25న ఉమ్మడి దేవాలయాల ఘటాలు ఊరేగింపు నిర్వహించనున్నారు. జులై 28న గోల్కొండ బోనాలతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి.
గట్టి బందోబస్తు మధ్య బోనాల జాతర జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు బోనాల ఉత్సవాలు జరుపుకొనేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున వివిధ ఆలయాలలో అమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పిస్తామని తెలిపారు.
ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని పండుగలను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నామన్నారు మంత్రి ఇంద్రకరణ్. తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి ప్రతీక బోనాలని.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు.
పూర్తి కథనం..