నూపుర్ శర్మ మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు హింసకు దారి తీస్తున్నాయి. రాజస్థాన్ లో ఘటన జరిగింది. నూపుర్ ఫోటోను స్టేటస్ గా పెట్టుకున్నాడనే కారణంతో ఉదయ్‌పూర్‌లో టైలర్‌ను హత్యచేశారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో హైదరాబాద్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. నగరంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. చార్మినార్, పాతబస్తీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి.
ఉదయ్ పూర్ కు చెందిన కన్హయ్య లాల్ అనే టైలర్ నూపుర్ శర్మ ఫోటోను స్టేటస్ గా పెట్టుకున్నాడు. అది తెలుసుకున్న ఇద్దరు దుండగులు దుస్తులు కుట్టించుకుంటానని టైలర్ దుకాణంలోకి వచ్చారు. దుకాణంలో కొలతలు తీసుకుంటున్న టైలర్ ను గొంతు కోసి దారుణంగా హత్య చేశారు.
అంతటితో ఆగకుండా టైలర్ హత్యా ఘటనను అంతా వీడియో తీశారు నిందితులు. హత్య అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎవరికైనా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. దీంతో ఉదయ్‌పూర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. హంతకులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తూ ర్యాలీ తీశారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. టైలర్ ను హత్య చేసిన ఇద్దరు హంతకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య చేయడానికి గల కారణాలను విచారిస్తున్నట్టు వెల్లడించారు. విచారణ అనంతరం హత్యకు గల పూర్తి వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు పోలీసు ఉన్నతాధికారులు.
ఈ ఘటన తర్వాత రాజస్థాన్ లో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. స్థానికులు షాపులన్నింటినీ మూసి వేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. పరిస్థితి తీవ్రత గుర్తించిన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్ రంగంలోకి దిగారు. నిందితులకు శిక్షపడుతుందని ప్రజలంతా సంయమనం పాటించాలని కోరారు. ప్రజలెవరూ విధ్వంసాలకు పాల్పడొద్దని కోరారు సీఎం.