డ్రగ్స్ డీలర్ టోనీని పోలీస్ కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. చంచల్ గూడ జైల్లో ఖైదీగా ఉన్న అతడ్ని శుక్రవారం కస్టడీకి తీసుకోనున్నారు పోలీసులు. ఐదు రోజులపాటు విచారణ కొనసాగనుంది. డ్రగ్స్ కేసులో టోనీతో పాటు ఏడుగురు వ్యాపారులను, ఇద్దరు డ్రైవర్ల నుంచి కీలక సమాచారాన్ని సేకరించారు పోలీసులు. మరిన్ని వివరాల కోసం కోర్టును ఆశ్రయించగా కస్టడీకి అనుమతించింది న్యాయస్థానం.
టోనీ నైజీరియన్. వ్యాపారం నిమిత్తం 2009లో ముంబైకి వచ్చాడు. ఇంటర్నేషనల్ డ్రగ్ స్మగ్లర్ స్టార్ బాయ్ తో పరిచయం ఉండడంతో షిప్ ల ద్వారా ముంబైకి డ్రగ్స్ ను తెప్పించేవాడు టోనీ. 2013 నుంచి డ్రగ్స్ మాఫియాను నడుపుతున్నాడు.
సంపాదించిన డబ్బు మొత్తాన్ని వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్ ఫర్ ద్వారా నైజీరియాకు పంపించేవాడు టోనీ. ఈమధ్యే అతడ్ని అరెస్ట్ చేశారు పోలీసులు. టోనీని విచారిస్తే మరికొంతమంది బడాబాబుల బండారం బయటపడుతుందని పోలీసులు కోర్టును ఆశ్రయించగా ఐదు రోజుల కస్టడీకి అనుమతించింది.
ఈ కేసులో పది మంది పరారీలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. వీరంతా పేరుమోసిన బడా వ్యాపారవేత్తలు. నాలుగు బృందాలుగా వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. డ్రగ్స్ కేసులో మొత్తం 23 మందిని నిందితులుగా తేల్చారు.