షిర్డీ సాయి ఆలయానికి ఈ ఏడాది కూడా కానుకల వర్షం కురుస్తోంది. నూతన సంవత్సరం వచ్చిన మొదటి రోజు నుంచే భక్తులు సాయిబాబాకు బంగారు, వెండి ఆభరణాలను సమర్పిస్తున్నారు. ఈ ఏడాది మొదటి రోజున సాయిబాబాకు ఓ భక్తుడు రూ.47 లక్షల విలువైన బంగారు కిరీటాన్ని సమర్పించారు.
అప్పటి నుంచి భక్తులు బంగారు ఆభరణాలు సమర్పిస్తూనే ఉన్నారు. తాజాగా షిర్డీ సాయికి హైదరాబాద్ కు చెందిన భక్తురాలు నాగం అలివేణి బంగారు తామరపువ్వును సమర్పించారు. నాగం అలివేణి తన భర్త జ్ఞాపకార్థం రూ.12 లక్షల 17 వేల 425 విలువైన 233 గ్రాముల బంగారు తామరపువ్వును ఆలయానికి బహూకరించారు.
సాయి బాబాకు దూప్ హారతి సమయంలో ఈ తామరపువ్వును అలివేణి సమర్పించారు. సాధారణ హారతి సమయంలోనూ వీటిని బాబా వస్త్రంపై కూడా ఉంచనున్నట్టు సాయి సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ జాదవ్ పేర్కొన్నారు.
సాయిబాబాకి బంగారు తామర పువ్వును సమర్పించిన తర్వాత అలివేణి చాలా సంతోషంగా కనిపించారు. గతేడాది ఓ భక్తుడు షిర్డీలో బాబాకు మూడు బంగారు తామర పువ్వులను కానుకగా ఇచ్చారు.