– అంబర్ పేటలో రెచ్చిపోయిన వీధికుక్కలు
– నాలుగేళ్ల చిన్నారిపై దాడి
– మేయర్ విజయలక్ష్మి, మంత్రి కేటీఆర్ విచారం
– విచారం వ్యక్తం చేస్తే సరిపోతుందా?
– మేయర్ చెప్పిన ముసలమ్మ ఎక్కడ?
– నిజంగా ఆ కుక్కలు మాంసం రుచి మరిగాయా?
– ఆకలితోనే దాడికి పాల్పడ్డాయా?
– ఏదైనా ఘటన జరిగినప్పుడే ఈ హడావుడి
– తర్వాత మళ్లీ అదే పరిస్థితి!
– జీహెచ్ఎంసీపై ప్రతిపక్షాల ఆగ్రహం
నాలుగేళ్ల వయసు.. అప్పటిదాకా సరదాగా ఆడుకున్నాడు.. దగ్గరలో ఉన్న అక్క దగ్గరకు వెళ్దామని బయల్దేరాడు. కానీ, మృత్యువు శునకాల రూపంలో వెంటాడింది. హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఈ హృదయ విదారక ఘటన అందర్నీ కలిచి వేస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రానికి చెందిన గంగాధర్ నాలుగేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం హైదరాబాద్ కు వలస వచ్చాడు. అంబర్ పేట ఛే నంబర్ చౌరస్తాలో ఉన్న ఓ కారు సర్వీస్ సెంటర్ లో వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు. భార్య జనప్రియ, ఆరేళ్ల కుమార్తె, నాలుగేళ్ల కుమారుడు ప్రదీప్ లతో కలిసి బాగ్ అంబర్ పేట ఎరుకుల బస్తీలో నివాసం ఉంటున్నాడు. ఆదివారం హాలిడే కావడంతో పిల్లలిద్దర్నీ పని చేస్తున్న సర్వీస్ సెంటర్ కు తీసుకెళ్లాడు గంగాధర్. కుమార్తెను పార్కింగ్ ప్రదేశం వద్ద ఉన్న క్యాబిన్ లో ఉంచి, కుమారుడిని సర్వీస్ సెంటర్ లోపలికి తీసుకెళ్లాడు.
ప్రదీప్ అక్కడే ఆడుకుంటూ ఉండటంతో మరో వాచ్ మన్ తో కలిసి పని మీద బయటకు వెళ్లాడు. కాసేపు అక్కడే ఉన్న పిల్లాడు.. తర్వాత అక్క కోసం క్యాబిన్ వైపు నడుచుకుంటూ వెళ్లాడు. అప్పుడే వీధి కుక్కలు వెంటపడ్డాయి. భయపడిన బాలుడు వాటి నుంచి తప్పించుకునేందుకు అటు ఇటూ పరుగులు తీసినా అవి వదల్లేదు. ఒకదాని తర్వాత ఒకటి దాడికి పాల్పడ్డాయి. రెండు కుక్కలు చెరోవైపు లాగడంతో ప్రదీప్ తీవ్రంగా గాయపడ్డాడు. తమ్ముడి ఆర్తనాదాలు విని తండ్రికి సమాచారమిచ్చింది. గంగాధర్ వాటిని వెళ్లగొట్టడంతో బాలుడిని వదిలేశాయి. తీవ్ర గాయాలపాలైన కుమారుడిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటనతో జీహెచ్ఎంసీకి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. దీంతో హడావుడిగా జీహెచ్ఎంసీ కార్యాలయంలో మేయర్ విజయలక్ష్మి అత్యవసర సమావేశం నిర్వహించారు. నాలుగేళ్ల బాలుడి మృతి ఘటన నేపథ్యంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ పరిధిలో 5.75 లక్షల వీధి కుక్కలున్నట్లు తెలిపారు. కుక్కల కట్టడిలో భాగంగా ప్రతి వార్డులో 20 శునకాలను దత్తత తీసుకోవడంపై దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు.
అయితే.. ఆకలితోనే కుక్కులు పిల్లాడిపై దాడి చేసి ఉంటాయని మేయర్ అన్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అంబర్ పేటలో ఓ వృద్ధురాలు కుక్కలకు మాంసం అందిస్తుందని.. రెండు రోజులుగా ఆమె కనిపించడం లేదని తెలిపారు విజయలక్ష్మి. మాంసం రుచి మరిగి దాడికి పాల్పడి ఉంటాయని అన్నారు. ఈ ఘటన చాలా బాధాకరమని, ఇలాంటివి రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు మేయర్. మంత్రి కేటీఆర్ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. అయితే.. ప్రతిపక్షాలు మాత్రం జీహెచ్ఎంసీని టార్గెట్ చేస్తున్నాయి. విచారం వ్యక్తం చేస్తే సరిపోతుందా? గతంలో ఇలాంటివి ఎన్నో జరిగాయని.. అసలు జీహెచ్ఎంసీ ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నాయి. ఏదైనా ఇష్యూ జరిగితేనే స్పందించి ఆ సమయానికి చర్యలు తీసుకొని తర్వాత గాలికొదిలేస్తున్నారని మండిపడుతున్నాయి.