– తెల్లవారుజామున తెల్లారిన బతుకులు
– సికింద్రాబాద్ లో ఘోర అగ్నిప్రమాదం
– 11 మంది సజీవ దహనం
– రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల విచారం
– ప్రమాద ఘటనతో ప్రభుత్వంలో చలనం
– ఇతర గోదాములపై ఫోకస్
పొట్ట చేతపట్టుకుని బతుకుదెరువు కోసం నగరానికి వచ్చారు. రెక్కాడితే గానీ డొక్కాడదు. పని చేస్తేనే నాలుగు వేళ్లు లోపలికి వెళ్లేది. లేకపోతే పస్తులే. రెక్కలు ముక్కలు చేసుకుని పొట్టపోసుకునే శ్రమ జీవులు వారంతా. కానీ.. పని చేసే ఆ ప్రాంతమే నరకకూపంలా మారింది. రోజూ సంతోషంగా తిరిగిన అక్కడి గదులే యమపాశం విసిరాయి. ఇదంతా బోయగూడ అగ్నిప్రమాదంలో బుగ్గిపాలైన కూలీల బతుకు చిత్రం.
బుధవారం ఉదయం 3 గంటల తర్వాత శాద్వన్ స్క్రాప్ గోడౌన్ లో భారీగా మంటలు ఎగసి పడ్డాయి. ఈ ఘటనలో 11 మంది సజీవ దహనమయ్యారు. ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. మృతులంతా బీహార్ వాసులు. కూలీ పని కోసం నగరానికి వలస వచ్చారు. విషయం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది స్పాట్ కు చేరుకుని దాదాపు 3 గంటలు శ్రమించి మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
11 మృతదేహాలకు గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ప్రమాద సమయంలో మంటలను చూసి భయపడి తాము ఉంటున్న గదుల్లోకి వెళ్లారు బాధితులు. మంటలు వేగంగా వ్యాపిస్తూ వారిని చుట్టుముట్టాయి. ఎటూ వెళ్లలేని పరిస్థితుల్లో కాలి బూడిదయ్యారు వారంతా. మృతదేహాలను గుర్తించే క్రమంలో కొన్ని ఒక దానిపై ఒకటి పడి ఉన్నాయని పోలీసులు వివరించారు. డెడ్ బాడీలను వారి స్వస్థలాలకు తరలిస్తున్నారు.
ఇటు ఈ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రమాదంపై పోలీస్, జీహెచ్ఎంసీ, ఫైర్ అధికారులతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు హోంమంత్రి మహమూద్ అలీ. ఎక్కడెక్కడ ఇలాంటి గోదాములు ఉన్నాయో. ఎంతమంది పని చేస్తున్నారో వివరాలు సేకరించాలని అదేశాలు జారీ చేశారు. ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇళ్ల మధ్య ఉన్న గోదాములను గుర్తించాలని ఆదేశించారు.
రాష్ట్రపతి రామ్ నాథ్, ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ ఇతర రాజకీయ ప్రముఖులు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. కేంద్రం ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల నష్టపరిహారం ప్రకటించగా.. తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షలు ఇస్తున్నట్లు తెలిపింది.
ఘటనపై ప్రముఖుల స్పందన ఇదే..!
రామ్ నాథ్ కోవింద్, భారత రాష్ట్రపతి- సికింద్రాబాద్ అగ్నిప్రమాదంలో కార్మికులు మృతి చెందడం మాటల్లో చెప్పలేని విషాదం. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వ్యక్తి త్వరగా కోలుకోవాలి.
నరేంద్ర మోడీ, భారత ప్రధాని- అగ్నిప్రమాదంలో కూలీలు చనిపోవడం బాధాకరం. ఈ ధుఃఖ సమయంలో నా ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి. ప్రమాదంలో మరణించినవారి కుటుంబ సభ్యులకు ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి రూ.2 లక్షల ఆర్థికసాయం అందజేస్తాం.
కేసీఆర్, తెలంగాణ సీఎం- బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారాన్ని అందజేస్తాం. చనిపోయిన వారి మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు సీఎస్ ఏర్పాట్లు చేయాలి. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలి.
బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు- పొట్టకూటి కోసం వచ్చి ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. అనుమతుల నుంచి ఫైర్ సేఫ్టీ చర్యల వరకు అధికారుల్లో నెలకొన్న నిర్లక్ష్యం, పర్యవేక్షణా లోపమే ఇలాంటి ప్రమాదాలకు కారణం. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి.
రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్- అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండి ఆదుకోవాలి. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలి. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా.