హైదరాబాద్ మహా నగరమైనా రోడ్డు మీద ట్రాఫిక్కు, వీధుల్లో సంపు ఉప్పెనలు…ఆకాశంలో ఉరి వేసేలా చూసే గజిబిజి కరెంటు వైర్లు మామూలేగా. అయితే ఈ కరెంటు వైర్ల పద్మవ్యూహంలో చిక్కుకుని మాడి మసైపోయే పక్షులను కాపాడేవారెవరు.
కనీసం వాటి వంక కన్నెత్తి చూసేదెవరు. అయితే ఆ ఫైర్ ఫైటర్స్ చాలా ఉన్నతంగా ఆలోచించారు.వైర్లలో చిక్కుకుని విలవిల్లాడుతున్న పావురాన్ని రెండు గంటలు శ్రమించి రక్షించారు. మానవత్వానికి అద్దంపట్టే ఈ ఘటన దిల్ షుఖ్ నగర్ లో చోటు చేసుకుంది.
ఓ కళాశాల హోర్డింగ్ కు కట్టిన బైండింగ్ వైర్ కు ఓ పావురం చిక్కుకొని ప్రాణాపాయ స్థితిలో అల్లాడింది.ఆ పావురాన్ని మలక్ పేట ఫైర్ స్టేషన్ సిబ్బంది రెండు గంటలు శ్రమించి కాపాడారు.
కళాశాల హోర్డింగ్ కు పావురం చిక్కుకుని ఉందని స్థానికులు ఉదయం ఎనిమిదిన్నర టైంలో ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. దానికి వెంటనే స్పందించిన ఫైర్ స్టేషన్ సిబ్బంది అక్కడికి చేరుకుని పావురాన్ని కాపాడేందుకు చాలా ప్రయత్నించారు.
ఎంతకూ సఫలం కాకపోయేసరికి చివరకు హైడ్రాలిక్ కట్టర్ తో విండో గ్రిల్ తొలగించి పావురాన్ని కాపాడారు. తర్వాత కొన్ని నీళ్లు తాగించి, గింజలు తినిపించారు. నిన్న సాయంత్రం నుంచి పావురం అక్కడ చిక్కుకొని ఉండటం వల్ల కాళ్లకు బాగా గాయాలయ్యాయి. దాంతో ఫైర్ స్టేషన్ సిబ్భంది బర్డ్ కేర్ సెంటర్ కు తరలించి చికిత్స చేయించారు.