హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆదివారం శోభాయాత్ర కోసం గ్రేటర్ లోని 3 కమిషనరేట్ల పరిధిలో 25 వేల మంది పోలీసులతో హుస్సేన్ సాగర్, సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్, సఫీల్ గూడ చెరువులతో పాటు మిగిలిన ప్రాంతాల్లో భద్రతను పెంచారు. శోభాయాత్ర సాగే రూట్ తో పాటు హుస్సేన్ సాగర్ చుట్టూ సీసీ కెమెరాలతో నిఘా ఉంచారు. అయితే నిమజ్జనానికి సంబంధించి విడుదల చేసిన రూట్ మ్యాప్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.
పైన కనిపిస్తున్న ఈ రూట్ మ్యాప్ ను ఓసారి తీక్షణంగా చూడండి. వినాయకుడి ఆకారం కనిపిస్తున్నట్లు ఉంది కదా. అవును.. బాలాపూర్ గణేషుడు వచ్చే రూట్ అచ్చం తొండంలాగే అనిపిస్తోందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మ్యాప్ లో అన్నిరూట్లను బ్లూ కలర్ లో చూపించి… ఒక్క బాలాపూర్ మార్గాన్ని కాషాయవర్ణంలో ఉంచారు. అది అచ్చం వినాయకుడి తొండాన్ని పోలి ఉంది. రూట్ మ్యాప్ ను దూరం నుంచి చూస్తే వినాయకుడి రూపంగా కనిపిస్తోంది.