అమాయక ప్రజలు కనిపిస్తే చాలు వారిని ఎలా మోసం చేయాలా అని వ్యూహాలు రచిస్తుంటారు కేటుగాళ్లు. అవతలి వ్యక్తి అవసరాన్ని బట్టి వానికి అనుగుణంగా మాయ మాటలు చెప్పి బుట్టలో వేసుకుంటారు. వారినుండి అందిన కాడికి డబ్బులు లాక్కుని వారిని నడి రోడ్డు మీద వదిలేస్తున్నారు. ఏం చేయాలో తెలియక.. దిక్కు తోచని స్థితిలో పోలీస్ స్టేషన్ లను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
ఏపీలోని విశాఖపట్నం గాజువాకకు చెందిన కాశీ సునీల్ కుమార్.. ఈజీ డబ్బులు సంపాధించాలనుకున్నాడు. అందుకు అనుగుణంగా చిత్ర పరిశ్రమను ఎంచుకుని.. ప్రణాళిక రచించాడు. సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నించే వారిని టార్గెట్ చేసుకున్నాడు. అలాంటి వారితో పరిచయాలు పెంచుకున్నాడు
ఇండస్ట్రీలో తనకు చాలా మందితో పరిచాయాలు ఉన్నాయని.. వారి సహాయంతో అవకాశాలు కల్పిస్తానని చెప్పి నమ్మించే వాడు. అలా వారి నుంచి డబ్బులు వసూలు చేసేవాడు. అవకాశాల కోసం చూస్తున్న ఓ వ్యక్తి వద్ద రూ. 91,420, మరో వ్యక్తి వద్ద రూ. 42,000 వసూలు చేశాడు. ఆ తర్వాత ఎన్ని సార్లు అడిగినా.. ఇవాళ, రేపు అంటూ మాటదాటేశాడు. చివరకు మోసపోయామని అర్ధం చేసుకొని రాచకొండ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు బాధితులు.
వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కాశీ సునీల్ ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అతని వద్ద నుంచి 2 మొబైల్ ఫోన్లు, ఒక బ్యాంకు అకౌంట్ పాస్ బుక్, రెండు ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.