టైమ్ బాగోకపోతే తాడే పామై కరిచిందని…నానుడి. రెండు నారింజ పండ్లు దొంగిలించినందుకు జీవితం తల్లకిందులైపోయింది. ఉపాధికోసం సౌదీ వెళ్ళిన ఓ అభాగ్యుడి దీనగాధ ఇది.తోటమాలికి తెలియకుండా లేదా షాపువాడికి తెలియకుండా ఏదైనా కాయ,పండు దొంగిలించడం ఇండియాలో అయితే చిలిపిదొంగతనం కిందకివస్తుంది, పట్టుబడితే రెండు చీవాట్లు పెట్టివదిలేస్తారు. మహాఅయితే డబ్బులు కట్టించుకుని పంపించేస్తారు. కానీ, సౌదీ అరేబియాలో ఏకంగా జైలు శిక్షవిధిస్తారు,జరిమానా అదనం.
గల్ఫ్ లో ఉపాధి కోసం వెళ్లిన తెలంగాణ ప్రవాసీయునికి ఇదే అనుభవం ఎదురైంది. రెండు నారింజ పండ్లను దొంగతనం చేసినందుకు జైలు పాలయ్యాడు. ఆపై తాత్కాలికంగా విడుదలైనా కోర్టు ప్రయాణంపై నిషేధం విధించడంతో ఇండియాకి రాలేక, వీసా గడువు ముగియడంతో సౌదీ ఉండే పరిస్థితి లేక నానా అగచాట్లు పడుతున్నాడు.
సిద్దిపేట జిల్లా గన్నేరువరం మండలానికి చెందిన బూర్ల ప్రభాకర్ (56) చాలాకాలంగా సౌదీలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఒకరోజు తాను పనిచేస్తున్న ప్రాంతంలోని అంగడిలో పెట్టిన ఓ బండిపై నుంచి రెండు నారింజ పండ్లను తీసుకుని తిన్నాడు.
పోలీసులు వచ్చి కేసు నమోదు చేయగా న్యాయస్థానం నెల రోజుల జైలు శిక్షతో పాటు వేయి రియాల్స్ (రూ.22 వేలు) జరిమానా విధించింది. జైలు శిక్ష అనుభవిస్తుండగా కంపెనీ పై కోర్టుకు వెళ్లగా 14 రోజుల శిక్ష అనంతరం ప్రభాకర్‌ను తాత్కాలికంగా విడుదల చేసింది.
ఈ ఘటన జరిగి రెండేళ్లకు పైగా అయింది. కేసు హైకోర్టు వరకు వెళ్లింది. విచారణ తేదీల గురించి ప్రభాకర్ తెలుసుకోకపోవడంతో సకాలంలో కోర్టుకు హాజరుకాలేకపోయాడు. భాషా సమస్యతో ప్రభాకర్ తన వాదనను వినిపించలేకపోవడంతో న్యాయస్థానం తుది తీర్పు ఇవ్వలేదు.
కానీ, అతన్ని జైలు నుంచి తాత్కాలికంగా విడుదల చేసి, అతనిపై ప్రయాణ నిషేధాన్ని విధించింది. ఈ విషయం తెలియని ప్రభాకర్.. 14 రోజులతో తన శిక్ష పూర్తయిందనుకున్నాడు.
తాను పని చేస్తు న్న కంపెనీతో కాంట్రాక్టు పూర్తవడంతో మూడు నెలల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేసిన ప్రభాకర్ అప్పటి నుంచి తన వీసాను రద్దు చేసి తనను స్వదేశానికి పంపించమని కంపెనీని ప్రాధేయ పడుతున్నాడు.
కానీ, న్యాయస్థానం తుదితీర్పు ఇవ్వకపోవడంతో కేసు పెండింగ్‌లో ఉంది. దీంతో వీసా రద్దు కాక మన దేశానికి రాలేక పోతున్నాడు. మరోవారంలో వీసా గడువు ముగియనుంది.
అప్పుడు నారింజ పండ్ల దొంగతనం కేసుతో పాటు, వీసా నిబంధననను ఉల్లంఘించినట్లుగా మరో కొత్తకేసుతో ఇబ్బందులు పడాల్సివస్తుందని ప్రభాకర్ ఆందోళన చెందుతున్నాడు. దీంతో సామాజిక కార్యకర్త అబ్దుల్ రఫీక్‌తో కలిసి కోర్టుల వెంట తిరుగుతున్నాడు. తనకు న్యాయ సహాయం చేయాలని అభ్యర్థిస్తున్నాడు.