హైదరాబాద్ నగరం దేశంలోని అన్ని నగరాల కంటే నివాసిత యోగ్యమైన నగరంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. శుక్రవారం హెచ్ జీసీఎల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ వార్షిక నివేదికను విడుదల చేశారు. నగర అభివృద్ధికి సంబంధించి నివేదికలు, సర్వేలు, సంస్థలు కితాబునిచ్చాయని అన్నారు.
రాబోయే రెండు వారాలపాటు రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 12,762 గ్రామ పంచాయతీలు, 142 మున్సిపాలిటీల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. రాష్ట్రంలో గతంలో కేవలం 68 మున్సిపాలిటీలు ఉండగా.. ప్రస్తుతం అవి 142కు చేరాయని తెలిపారు. అలాగే గ్రామ పంచాయతీల సంఖ్య కూడా భారీగా పెరిగిందన్నారు.
పచ్చదనం పేరుతో 10 శాతం బడ్జెట్ కేటాయించి అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఎస్ఆర్డీపీ కింద అనేక పనులు చేపట్టామని వెల్లడించారు. ఎస్ఆర్డీపీలో పురోగతి ఉందని.. ఉస్మాన్ సాగర్ చుట్టూ 18 ఎకరాల పరిధిలో కొత్త పార్క్ ఏర్పాటు జరుగుతుందని పేర్కొన్నారు. ఇందుకు గాను రూ. 35.6 కోట్లతో పనులు చేపట్టామని వివరించారు. వాటిని త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.
Advertisements
నగరంలో 2 చోట్ల స్కై వాక్ లు అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు మంత్రి. మూసీనది మీద 14 బ్రిడ్జీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతీనెలా మున్సిపాలిటీలకు నిధులు అందిస్తున్నామని, ప్రజల కేంద్రంగా మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.