హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. తమకు వెంటనే మెస్ సౌకర్యం కల్పించాలని నిరసన చేపట్టారు. యూనివర్సిటీలోని రోడ్డుపై భోజనం చేసే ప్లేట్లతో బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.
విద్యార్థుల ఆందోళనతో రోడ్డుపై కొంతసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత రెండు నెలలుగా తమకు మెస్ వసతి కల్పించడం లేదని ఈ-2 బ్లాక్ హాస్టల్ విద్యార్థులు మండిపడ్డారు.
వెంటనే వీసీ వచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని విద్యర్థులు డిమాండ్ చేశారు. అనంతరం వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తమ సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు విద్యార్థులు. విద్యార్థుల ఆందోళనతో పోలీసులు యూనివర్సిటీకి చేరుకున్నారు.