చెట్టుపేరు చెప్పి కాయలమ్మాడో కేటుగాడు..! తన తండ్రి తెలంగాణాలో కాబోయే పొలిటీషయన్ అని కలరిచ్చి లక్షలు నొక్కేసాడు. అతని ఫ్యామిలీ బ్యాగ్రౌంగ్ ఆరాతీసిన బాధితుడికి అతనిదో ఫ్రాడ్ ఫ్యామిలీ అని తేలింది.అప్పటికే బాధితుడు నిండా మునిగిపోయాడు. ఎస్సార్ నగర్ ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యవంశీ ప్రకాష్(28) అనే వ్యక్తి అమీర్ పేటలో జీపీఎస్ ఇన్ఫోటెక్ అనే సంస్థ నిర్వహిస్తున్నాడు.
గతేడాది జులైలో కార్తీక్ రెడ్డి(30)అనే వ్యక్తి సూర్యవంశీని కలిసాడు. తన తండ్రి రామ్మోహన్ రెడ్డి ఏపీలో ఎమ్మెల్సీ అని తాను కాబోయే వైఎస్సార్ తెలంగాణా పార్టీ నగర అధ్యక్షుడినని చెప్పుకున్నాడు. జీపీఎస్ ఇన్ఫోటెక్ కార్యాలయంలో తనకు కొంతభాగం అద్దెకివ్వాలని కోరాడు. అంగీకరించిన సూర్యవంశీ ప్రకాశ్ రూ.40 వేల డిపాజిట్ తో, నెలకు రూ.15 వేల చొప్పున తన కార్యాలయంలోని కొంత భాగం అద్దెకిచ్చాడు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం బలపడింది. ఇదే అదునుగా తనకు డబ్బు అవసరం ఉందని చెప్పి ఒక సారి సూర్యవంశీ వద్ద రూ.86 వేలు అప్పుగా తీసుకున్నాడు. మరోసారి కార్తీక్ రెడ్డి తండ్రిగా చెప్పిన రామ్మోహన్ రెడ్డి పేరిట మరో వ్యక్తి సూర్యవంశీతో ఫోన్ లో మాట్లాడాడు. తాను ఎమ్మెల్సీనని, ఏపీ, తెలంగాణాలో చాలా ఆస్తులున్నాయని చెప్పాడు. అత్యవసరంగా నగదు అవసరమని చెప్పడంతో విడతలవారీగా రూ.26 లక్షల 95 వేలు కార్తిక్ రెడ్డికి ముట్ట చెప్పాడు. తర్వాత తీసుకున్న అప్పు ఎంతకూ తిరిగి ఇవ్వక పోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు కార్తిక్ రెడ్డి గురించి ఆరా తీసాడు.
కార్తీక్ రెడ్డి అమీర్ పేటలోని అంకమ్మ బస్తీ నివాసని, అతనితోపాటు అతని కుటుంబ సభ్యలు ఇదే తరహా మోసాలకు పాల్పడుతుంటారని గుర్తించాడు. మంగళవారం ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కార్తీక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.