హైదరాబాద్ లో మరో భారీ రియల్ ఎస్టేట్ మోసం వెలుగు చూసింది. సిటీ శివారులో వెంచర్ల పేరుతో జయత్రి అనే సంస్థ అమాయకులను బురిడీ కొట్టించింది. హైదరాబాద్ లో ఈ సంస్థ ప్రీలాంచింగ్ పేరుతో రూ.50 కోట్లు వసూళ్లకు పాల్పడింది. తక్కువ రేట్లకే ప్లాట్లు, ప్రీలాంచ్ పేరుతో జనానికి కుచ్చుటోపీ పెట్టింది. హైదరాబాద్ శివార్లలోని ఖాళీ భూములను వెతికి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి.. అది తన భూమేనని. అక్కడే తాను అపార్ట్ మెంట్లు కట్టబోతున్నట్లు బాధితులను నమ్మించసాగాడు.
అలాగే ఒక్కొక్కరి దగ్గర నుంచి 5, 10, 15, 20, 25, 40 లక్షల వరకు వసూలు చేసి దాదాపు 20 కోట్ల రూపాయలు కాజేశాడు. ఏళ్లు గడుస్తున్నా ప్లాట్లు ఇవ్వకపోవడంతో బాధితులు శ్రీనివాస్ ను నిలదీశారు. రేపు, మాపని చెప్పగా కొన్నాళ్లు వేచి చూశారు. అతని నుంచి ఎలాంటి స్పందన లేకపోయే సరికి బాధితులు మరోసారి శ్రీనివాస్ ఆఫీసుకు వెళ్లి గొడవ చేశారు. శ్రీనివాస్ ఆఫీసును మూసేసి, తప్పించుకుని తిరుగుతున్నాడు.
ఈ క్రమంలోనే బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేపీహెచ్బీ సమీపంలోని పీఎన్ఆర్ వద్ద అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇప్పటికే నిందితుడిపై కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ పరిధిలో 8 కేసులు నమోదు చేసినట్లు ఏసీపీ చంద్ర శేఖర్ తెలిపారు.
కాగా గతంలో కూడా కాకర్ల శ్రీనివాస్ ఏపీలో కోమలి రియల్ ఎస్టేట్ పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ 2016లో జైలు నుంచి విడుదలై వచ్చి హైదరాబాద్ లో జయత్రి సంస్థను స్థాపించినట్లు పోలీసులు తెలిపారు. గోపల్ పల్లిలో కమర్షియల్ స్పేస్ ఇప్పిస్తామని 80 మంది రూ.20 లక్షల చొప్పున వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.