హైదరాబాద్ నగరంలో మరోసారి మాదక ద్రవ్యాలు కలకలం సృష్టించాయి. ఇప్పటికే న్యూఇయర్ సందర్భంగా పెద్ద మొత్తంగా మాదక ద్రవ్యాలను సరఫరా చేసే ముఠాల ఆటకట్టించారు పోలీసులు. తాజాగా సంక్రాంతి పండుగ టార్గెట్ గా పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న మరో వ్యక్తిని శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ శివారులో 180 గ్రాముల కొకైన్ ను తరలిస్తుండగా హయత్ నగర్ ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. నైజీరియాకు చెందిన వ్యక్తి నగరంలో మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. వీటిని బెంగుళూరు నుంచి హైదరాబాద్ కు తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది.
అయితే ఈ మధ్య నగరానికి భారీ మొత్తంలో మాదక ద్రవ్యాల రవాణా జరుగుతుంది. ఇటీవల వీటిని సరఫరా చేస్తున్న ముఠాలను అధికారులు వరుసగా పట్టుకుంటున్నారు.
నగరంలో యువతే లక్ష్యంగా డ్రగ్స్ సరఫరా జరుగుతుండటం.. నగర వాసులను ఆందోళనకు గురి చేస్తోంది. నిత్యం దాడులు చేస్తున్నా ఇంకా నగరంలో మాదక ద్రవ్యాలను సరఫరా చేయడానికి కేటుగాళ్లు కొత్త దారులు వెతుకుతున్నారు.