దసర పండుగను పురస్కరించుకొని ప్రజలు సొంతూళ్లకు ప్రయాణమవుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి వేలాది సంఖ్యలో జనాలు పల్లెబాట పట్టారు. బస్సులు, సొంత వాహనాలు, రైళ్ల ద్వారా సొంతూళ్లకు చేరుకుంటారు. దసరా పండుగ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. పండుగ సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పెద్ద సంఖ్యలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.
ఈ కారణం దృష్ట్యా జీఆర్పీ, ఆర్పీఎఫ్ బలగాలు బందోబస్తులో ఉన్నాయి. రైల్వే స్టేషన్ లో గేట్ నెంబర్ 3 నుండి మాత్రమే ప్రయాణికులకు ఎంట్రీ బోర్డు పెట్టారు. గేట్ నెంబర్ 4 వద్ద నో ఎంట్రీ బోర్డు ఏర్పాటు చేశారు. గేట్ నెంబర్ 5ను పూర్తిగా మూసి వేశారు రైల్వే అధికారులు. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఎగ్జామ్ ఫలితాలు ఆలస్యమవుతున్న క్రమంలో ప్రత్యేక ఇంటెలిజెన్స్ రిపోర్టు వచ్చింది.
మరోవైపు ‘అగ్నిపథ్’ పథకం ప్రకటించిన సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకున్న అలర్ల దృష్ట్యా కూడా బందోబస్తు మరింత పెంచారు. మొత్తంగా నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో భారీ బందోబస్తు కనిపిస్తోంది. ఎవరైనా అనుమానంగా కనిపిస్తే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనుమానిత వస్తువులు, బ్యాగులను తనిఖీలు చేస్తున్నారు. రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో వాహనాలను కూడా తనిఖీలు చేస్తున్నారు.
కాగా దసరా పండగకు 315 ప్రత్యేక రైళ్ళని నడుపుతుంది దక్షిణ మధ్య రైల్వే. కొన్ని స్పెషల్ రైళ్లకు అదనపు చార్జీలు వసూలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఒకవేళ ఇంకా రద్దీ పెరిగితే అదనపు బోగీలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇదిలా ఉంటే పలు రైళ్ల వేళల్లో మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు రైళ్ల సమయాన్ని తెలుసుకొని స్టేషన్‌కు చేరుకోవాలని చెప్పారు. ఇక పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకొని కొన్ని స్టేషన్‌లలో ప్లాట్ ఫామ్ టికెట్లను పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.