హైదరాబాద్‌లో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి హైదరాబాద్‌లో వ్యాపారం చేయాలంటే పోలీసుల అనుమతి తప్పని సరి చేశారు. గతంలో ఈ లైసెన్సింగ్ విధానం అమలులో ఉండేది.
2014 వరకు ఈ లైసెన్సింగ్ విధానం కొనసాగుతూ వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దాన్ని నిలిపి వేశారు. తాజాగా లైసెన్సింగ్ విధానాన్ని మళ్లీ పునరుద్ధరించారు. తాజా నిర్ణయం నేపథ్యంలో వ్యాపారం చేసేందుకు ట్రేడ్, ఫుడ్, ఫైర్‌తోపాటు పోలీస్ ల నుంచి కూడా లైసెన్స్ తీసుకోవాల్సి వుంటుంది.
వ్యాపారస్తులు ఈ కొత్త లైసెన్సులు తీసుకునేందుకు మార్చి 31వరకు పోలీసు శాఖ గడువు ప్రకటించింది. సినిమా థియేటర్ సినిమాటోగ్రఫీ, ఫైర్ క్రాకర్స్, పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారస్తులు ఈ లైసెన్సులు తీసుకోవాలని పోలీసులు తెలిపారు.
ఈ లైసెన్సుల కోసం వ్యాపారస్తులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని పోలీసు శాఖ సూచించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి తదుపరి ఏడాది మార్చి 31 వరకు గడువుతో ఈ నూతన లైసెన్సులు జారీ చేయనున్నట్టు పోలీసు శాఖ పేర్కొంది.