ఎప్పుడూ ప్రశాంతంగా ముగిసిపోయే ప్రెస్ క్లబ్ హైదరాబాద్ ఎన్నికలు ఈసారి రచ్చకెక్కాయి. ఎన్నికల్లో 80 ఓట్ల తేడాతో ఓటమి పాలైన తర్వాత.. తమను బెదిరించి, పత్రాలను లాక్కొని బ్యాలెట్ బాక్సుల్లో నీళ్లు పోశారని సూరజ్ భరద్వాజపై రిటర్నింగ్ అధికారులు హేమసుందర్ రావు, రంగాచార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
అనేక దఫాలుగా ప్రెస్ క్లబ్ ఎన్నికలను నిజాయితీగా నిర్వహించి, ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించామని ఫిర్యాదులో వివరించారు రిటర్నింగ్ అధికారులు. కానీ.. ఈసారి అధ్యక్ష పదవికి పోటీ చేసిన సూరజ్ భరద్వాజ ఓటమిని తట్టుకోలేక నానా రచ్చ చేశారని తెలిపారు. ఆయన చెప్పారని పోలైన ఓట్లను రెండు సార్లు లెక్కించామని.. 80 ఓట్ల తేడాతో ఓడిపోయారని చెప్పినా వినకుండా స్వస్తిక్ గుర్తులు సరిగ్గా లేవని, దొంగ ఓట్లు వేశారనే నింద మోపుతూ దౌర్జన్యానికి దిగారని పేర్కొన్నారు.
ఎన్నికల పత్రాలు లాక్కొన్న సూరజ్.. బలవంతంగా తమను నిర్బంధించారని పోలీసులకు వివరించారు రిటర్నింగ్ అధికారులు. అంతేకాకుండా ఎన్నికల ప్రకటన నిలుపుదల చేయాలని సంతకాలు చేశారని ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
సూరజ్ తో పాటు ప్రెస్ క్లబ్ సభ్యులు కాని వారి వివరాలు.. సీసీటీవీ ఫుటేజీతో పాటు వీడియో రికార్డులను పోలీస్ అధికారులకు సమర్పించారు హేమసుందర్ రావు, రంగాచార్య.