సంచలనం సృష్టించిన హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని.. రాడిసన్ పుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. ఇందులో భాగంగా శుక్రవారం కేసులో ప్రమేయం ఉన్న ఇద్దరిని వివిధ అంశాలపై ప్రశ్నిస్తున్నారు.
ఈ డ్రగ్స్ కేసులో టోని, అభిషేక్‌లతో సంబంధాలున్న వారి వివరాలను పోలీసులు ఇప్పటికే సేకరించారు. ఇందులో భాగంగా అభిషేతో పరిచయాలున్నట్లు గుర్తించిన పోలీసులు విచారణకు హాజరుకావాలని ముగ్గురికి నోటీసులిచ్చారు. వారిలో రంగనాయకులు, ఈశ్వర్ ప్రసాద్ శుక్రవారం విచారణకు హాజరయ్యారు. అనారోగ్యం కారణంగా రాలేనని మరో వ్యక్తి ఆదిత్య పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
కాగా, రంగనాయకులు, ఈశ్వర్ ప్రసాద్‌కు అభిషేక్‌తో ఎంతకాలం నుంచి పరిచయం ఉందనే వివరాలు సేకరిస్తున్నారు. బంజారాహిల్స్ సీఐ నాగేశ్వర్ రావు, హైదరాబాద్ నార్కోటిక్ విభాగం ఏసీపీ నర్సింగ్ రావులు ఇద్దరిని ప్రశ్నిస్తున్నారు. పబ్‌కు ఎన్నాళ్లుగా వెళ్తున్నారనే వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.
ఇప్పటికే ఈ కేసులో పోలీసులు గురువారం శశికాంత్, సంజయ్‌లను దాదాపు 7 గంటల పాటు పోలీసులు విచారించారు. ఆ ఇద్దరు కూడా టోనీ డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్నారు. పబ్‌లో 4.6 గ్రాముల కొకైన్ పట్టుబడటంతో, కొకైన్‌ను ఎవరు తీసుకొచ్చారనే కోణంలో బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.