తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బీటెక్ స్టూడెంట్ నవీన్ మర్డర్ కేసులో యువతి పాత్రపై కీలక అప్ డేట్ ఇచ్చారు రాచకొండ పోలీసులు. ఈ కేసుతో యువతికి ఎలాంటి సంబంధం లేదని రాచకొండ సీపీ డీఎస్ చౌహన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవీన్ హత్య కేసులో యువతికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు.
నిందితుడు హరిహర కృష్ణ నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అతడికి సహకరించిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తు జరుగుతుందని.. ఇప్పుడే స్పందించలేమన్నారు. ఈ కేసుకు సంబంధించి శుక్రవారం పోలీసులు సీన్ రికన్ స్ట్రక్షన్ పూర్తి చేశారు.
నవీన్ హత్యకు అమ్మాయికి సంబంధం ఉండొచ్చని నిందితుడు హరిహర కృష్ణ తండ్రి ఆరోపించారు. అలాగే నిందితుడు నవీన్ ను హత్య చేసిన తర్వాత అమ్మాయితో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నవీన్ హత్యకు ఆ అమ్మాయికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో నవీన్ హత్యకి.. ఆ అమ్మాయికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. మరి రానున్న రోజుల్లో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.