హైదరాబాద్ లో రియల్ బూమ్ ఢమాల్ అయింది. స్థిరాస్తి రంగం మందగించడంతో.. రెండేళ్లుగా ఊపు మీద ఉన్న రియల్టీ ఇప్పుడు నేలచూపులు చూస్తోంది. ముఖ్యంగా ఐటీ, రీజినల్ రింగ్ రోడ్డు పేర భారీగా సాగిన భూముల అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయి.
కరోనా కారణంగా ఏడాది పాటు స్థిరాస్తి రంగంలో స్తబ్ధత నెలకొంది. అనంతరం నెమ్మదిగా పుంజుకుని స్థలాల అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇతర వ్యాపార రంగాలు కుదేల్ కావడంతో పెట్టుబడికి రియల్టీ రంగమే మంచిదనే భావనతో సామాన్య, మధ్యతరగతి మొదలు కార్పొరేట్ సంస్థలు భూముల వైపు మొగ్గుచూపాయి. దీంతో భూముల రేట్లు, ప్లాట్ల ధరలు సాధారణ ప్రజలకు అందనంత దూరంలో నిలిచాయి.
కాగా, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మొదలు, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమనం, నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదల, రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కడం, రిజిస్ట్రేషన్ ధరల పెంపు తదితర కారణాలు స్థిరాస్తి రంగంలో ఒడిదుడుకులకు కారణంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితి మరో రెండేళ్ల వరకు ఉండే అవకాశం లేకపోలేదని రియల్టీ నిపుణులు అంచనా వేస్తున్నారు.
మొన్నటి వరకు హైదరాబాద్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు కిటకిటలాడాయి. అయితే 111 జీవోను ఎత్తేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న అనంతరం రిజిస్ట్రేషన్లు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఇప్పడు రియల్ ఎస్టేట్ రంగంపై మరో పిడుగు పడే ప్రమాదం ఉందని రియల్ రంగం నిపుణులు అంచనా కొస్తున్నారు.
రియల్ ఎస్టేట్ రంగంపై ఇప్పటికే కొంత ప్రభావం చూపుతున్న విదేశీ వలసల ప్రభావం మున్ముందు మరింతగా ఉంటుందని అంటున్నారు. ఇప్పుడే మొదలైన ఈ ధోరణి ఇలాగే సాగితే మటుకు, రియల్ ఎస్టేట్ రంగం పెట్టుబడుల సంక్షోభంతోపాటుగా మార్కెట్ సంక్షోభాన్ని ఎదుర్కునే ప్రమాదం లేక పోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.