హైదరాబాద్ వాసులపై ప్రకృతి పగబట్టినట్లే ఉంది. మొన్నటి ఎండాకాలంలో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలతో అల్లాడిపోయారు నగర ప్రజలు. వర్షాకాలంలో అధిక వానలతో వణికిపోయారు. ఇప్పుడు చలి వంతు వచ్చింది. ఈసారి రికార్డ్ స్థాయిలో చలిగాలులు వీస్తున్నాయి. రికార్డ్ అంటే ఏ ఏడిదో, రెండేళ్లదో కాదు.. ఈ దశాబ్దంలోనే అత్యల్ప కనిష్ణ ఉష్ణోగ్రత అంట. ఈ విషయాన్ని వాతావరణశాఖ స్పష్టం చేసింది.
హైదరాబాద్ లో డిసెంబర్ నెలలో అత్యంత చలిరోజుగా శనివారం రికార్డయిందని తెలిపింది వాతావరణశాఖ. సెంట్రల్ యూనివర్సిటీలో ఉదయం వేళ అత్యల్పంగా 8.2 డిగ్రీలు, పటాన్ చెరులో 8.4, రాజేంద్రనగర్ లో 9.1 డిగ్రీల కనిస్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతంలో 2015 డిసెంబర్ 13న హైదరాబాద్ లో అతి తక్కువగా 9.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. వచ్చే మూడు రోజుల్లో సాధారణ ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతుందని చెబుతున్నారు అధికారులు.
రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు వృద్ధులు, చిన్నారుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు.