మీ ఉద్యోగాలకు డోకా లేదు, బస్సులు కూడా యాధావిధిగా ఉంటాయి… ఆర్టీసీని నాలుగు నెలల్లోకి లాభాల్లోకి తీసుకొద్దాం అంటూ సీఎం కేసీఆర్ ప్రకటన చేసి పక్షం రోజులైనా గడిచాయో లేదో… అప్పుడే ఆర్టీసీపై కత్తి మొదలైనట్లు కనపడుతోంది. గ్రేటర్‌లో ఆర్టీసీ నష్టాల్లో ఉందనేది అందరికీ తెలిసిందే. దీంతో ఆ భారం తగ్గించుకునేందుకు ఆర్టీసీ సరికొత్త ఎత్తుగడ వేసినట్లు కనపడుతోంది.
గ్రేటర్ పరిధిలో ఉన్న 29 డిపోల్లో ఇప్పటికే కాలం చెల్లిన బస్సుల పేరుతో డిపోకు 10 చొప్పున బస్సులు తీసేయ్యాలని నిర్ణయించగా… ఇప్పుడా సంఖ్యను 30కి పెంచాలని నిర్ణయించారు. తద్వారా గ్రేటర్‌లో ఆర్టీసీకి ఉన్న నష్టాలను కాస్తయిన తగ్గించుకోవాలన్నది ఆర్టీసీ యాజమాన్యం ఎత్తుగడగా కనపడుతోంది. మొత్తంగా 1000బస్సులను పక్కనపెట్టాలన్నది ఆర్టీసీ నిర్ణయంగా తెలుస్తోంది. బస్ చార్జీలు పెంచడానికి ముందు గ్రేటర్ హైదరాబాద్ రీజీయన్‌లో ఆర్టీసీకి నెలకు 145కోట్ల ఖర్చు ఉండగా, 95 కోట్ల ఆదాయం ఉండేది. చార్జీల పెంపుతో మరో 30కోట్లకు పైగా ఆదాయం పెరిగింది.
సిటీలో 3838 బస్సులు నడుస్తున్నాయి. అందులో 1000 బస్సులను పక్కనపెట్టబోతున్నారు. దీంతో ప్రయాణికుల ఇక్కట్లు మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే అధికారులు మాత్రం మెట్రో రూట్లలో రద్దీ తక్కువగా ఉంటున్న కారణంగా బస్సులను పక్కనపెట్టబోతున్నట్లు చెబుతున్నా…. నష్టం పూడ్చుకునేందుకే ప్రజలకు ఇబ్బందులు చేయబోతున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
అయితే, ఈ చర్యలను ఇప్పుడే అడ్డుకోకపోతే… క్రమంగా జిల్లాలకు, నష్టాల్లో ఉన్న రూట్లు అంటూ వేరు చేసి, సీఎం సమ్మెకు ముందున్న ప్లాన్‌ను అమలు చేసే అవకాశం లేకపోలేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
గజ్వేల్ ఎమ్మెల్యేగా సిద్దిపేట కలెక్టర్