ప్రస్తుతం బైక్ పై ప్రయాణించే వారంతా దాదాపుగా హెల్మెట్ ధరించే ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారు. కొంతమంది హెల్మెట్ ధరించి బైక్ డ్రైవ్ చేయలేమని చెప్తుంటారు. మరికొంతమంది జుట్టు రాలడం వంటి కారణాలతో అప్పుడప్పడూ మాత్రమే హెల్మెట్ ను ధరిస్తుంటారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతం హెల్మెట్ లేని ప్రయాణం జేబుకు చిల్లు వేసేదిలా మారింది. ఎందుకని అనుకుంటున్నారా..? రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు హెల్మెట్ ను ధరించాల్సిందేనని హెచ్చరికలు జారీ చేశారు ట్రాఫిక్ పోలీసులు. అయినప్పటికీ వాహనదారుల్లో మార్పు లేకపోవడంతో హెల్మెట్ ధరించకపోతే భారీగా చలాన్లు విధిస్తామని తేల్చిచెప్పారు. ఇక చెప్పినట్టుగానే ట్రాఫిక్ పోలీసులు వాహనదారులు హెల్మెట్ ధరించకపోతే భారీ చలాన్లు విధించినట్లుగా కథనాలు వచ్చాయి.
దీంతో వాహనదారులు ఈ చలాన్లు మేము భరించలేం బాబోయ్ అంటూ హెల్మెట్స్ ధరించడానికి అలవాటు పడుతున్నారు.హెల్మెట్ ధరించే ఎక్కవగా ప్రయాణిస్తున్నారు. ఇక బైక్ పై ముగ్గరు ప్రయాణిస్తే కూడా చలాన్లు అధికంగా ఉండటంతో ఇద్దరు మాత్రం ప్రయాణిస్తూ తూచా నిబంధనలను పాటిస్తున్నారు. ఈ కఠిన నిబంధనలు అమల్లోకి రావడం మూలంగా కొంతమేర రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. అయితే బైక్ నడిపే వ్యక్తి హెల్మెట్ ధరించడం మూలంగా ప్రాణాలతో బయటపడుతున్న… వెనక కూర్చున్న వ్యక్తి మాత్రం ప్రాణాలను కోల్పోతున్నాడు. దీంతో ఎలాగైనా ఈ అనర్దాలకు చెక్ పెట్టాలని సైబరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి బైక్ పై వెళ్లే ఇద్దరు హెల్మెట్ పెట్టుకోవాలని లేదంటే చలాన్ విధిస్తామని హెచ్చరిస్తున్నారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ విధానం అమలు అవుతోంది. ఇప్పుడు సైబరాబాద్ పరిధిలోనూ మంగళవారం నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది. బైక్ ప్రమాదాల్లో 70 శాతం అనర్థాలు హెల్మెట్ లేకపోవడం వల్లే జరుగుతున్నాయి. అయితే ఒక్కోసారి బైక్ నడిపే వ్యక్తి హెల్మెట్ ధరించడం వలన ప్రాణాలతో బయటపడుతున్న వెనక కూర్చున్న వ్యక్తి ప్రాణాలు కోల్పోతున్నాడు. దీంతో సైబరాబాద్ పోలీసులు బైక్ పై ప్రయాణించే ఇద్దరు తప్పనిసరిగా హెల్మెట్స్ పెట్టుకోవాల్సిదేనంటూ హెచ్చరిస్తున్నారు. లేదంటే చలాన్ చెల్లించాల్సిందేనని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే బైక్ పై వెనక ప్రయాణించే వ్యక్తి హెల్మెట్ ధరించకపోతే బైక్ నడిపే వ్యక్తే చలాన్ చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. రాచకొండ పరిధిలో ఆల్రెడీ వారం నుంచీ 263 కేసులు రాశారు. రూ.28,400 ఫైన్లు వేశారు. ఇప్పుడు రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల ప్రజలంతా… రెండు హెల్మెట్లు కొనుక్కోవడం బెటర్ అని పేర్కొంటున్నారు.
అయితే ఈ నిబంధన కేవలం నగరంలోనే ఎందుకు.. ప్రమాదాలను నివారించాలనే సదుద్దేశ్యం ఉంటే తెలంగాణ వ్యాప్తంగా ఈ రూల్ అమల్లోకి తీసుకురావచ్చు కదా అంటున్నారు.