ప్రధాని మోడీ మరో సంచలన నిర్ణయం? - Tolivelugu

ప్రధాని మోడీ మరో సంచలన నిర్ణయం?

దేశ రెండో రాజధానిగా హైదరాబాద్?

, ప్రధాని మోడీ మరో సంచలన నిర్ణయం?హైదరాబాద్ : సంచలన నిర్ణయాలతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ ప్రజల్ని మెస్మరైజ్ చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరో సంచలనం తీసుకోబోతున్నారా? అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా, దేశ రెండవ రాజధానిగా ప్రకటించబోతున్నారా..?
యస్.. అందుకు చాలా అవకాశం ఉందని మీడియాలో విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతోంది. ఇటీవల కాలంలో ప్రతి రాజకీయ నాయకుడు ఈ విషయమే మాట్లాడుతున్నారు. రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్‌ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. ఐతే.. తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు అందుకు అంగీకరించలేదు. హైదరాబాద్‌ని రెండవ రాజధాని చేయాలని, ఇక్కడ సుప్రీం కోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్లయితే ఉన్నాయి. ఇప్పుడు ఇదే మళ్లీ తెరపైకి వచ్చింది. రాజకీయ, ప్రాంతీయ కారణాల రీత్యా హైదరాబాద్‌ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. దక్షిణ భారతదేశానికి ప్రాధాన్యం ఇస్తూ, ఇక్కడ కూడా తమ ప్రాబల్యాన్ని నిలుపుకోవాలన్న ఉద్దేశంతో హైదరాబాద్‌ని రెండవ రాజధానిగా చేసే ఆలోచనతో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. ఎప్పటి నుంచో మన హైదరాబాద్ భారత రాష్ట్రపతికి శీతాకాల విడిది కేంద్రంగా ఉంటోంది. సికింద్రాబాద్‌లోని బొల్లారంలో రాష్ట్రపతి నిలయం ఉంది. అక్కడ ఆయన ప్రతి ఏడాది 15 రోజులు నివాసం ఉంటారు. పచ్చిక బయళ్లు, ఔషధ మొక్కలు, రంగురంగుల పూల తోటలు, పండ్ల తోటలతో ప్రకృతి శోభను సంతరించుకొని అంత్యంత ఆకర్షణీయంగా నిర్మించిన ఈ భవనాన్ని 1860లో అప్పటి నిజాం నవాబు నజీరుద్దౌలా కట్టించారు.
హైదరాబాద్‌తో పాటు సిమ్లాలో కూడా రాష్ట్రపతికి వేసవి విడిది కూడా ఉంది.  కశ్మీర్ విషయంలో తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రజలలో బీజేపీ మంచి పట్టు సాధించింది. అలాగే సీడీఎస్ (చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌) నియామక నిర్ణయం కూడా పలువురిని ఆకట్టుకుంది. ఇదే క్రమంలో అటు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసి, హైదరాబాద్‌ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి ఇటు ఏపీ ప్రజల మనసు చూరగొనాలన్నఉద్దేశంలో బీజేపీ ఉన్నట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆ విధంగా రెండు తెలుగు రాష్ట్రాలలో పట్టు సాధించడం కోసం బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ నేతలు అవన్నీ వట్టి పుకార్లని కొట్టిపారేస్తున్నారు. హైదరాబాద్‌ దేశానికి రెండో రాజధాని అంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఇప్పటికే ఒక స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఐతే.. అదే సమయంలో ఆయన ఇంకొక మాట కూడా అన్నారు. 2023లో తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని ఆయన చెప్పిన ప్రకారం ఏదైనా జరగవచ్చు. ఇలావుంటే.. హైదరాబాద్ యూటీ అనే వార్తలన్నీ వదంతులు మాత్రమేనని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొట్టిపారేశారు. టీఆర్ఎస్ పార్టీలో ఎవరికీ హైదరాబాద్‌ను యూటీ చేయడం సహజంగానే ఇష్టం వుండదని పరిశీలకుల వ్యాఖ్య.

Share on facebook
Share on twitter
Share on whatsapp