ఐపీఎల్ 2022 సీజన్ 15 చివరి దశకు చేరింది. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి టీంలు ఇప్పటికే ప్లే ఆఫ్స్ నుండి తప్పుకున్నాయి. కాగా.. కొత్తగా వచ్చిన రెండు టీం లు కప్పుకొట్టడమే లక్ష్యంగా దూసుకుపోతున్నాయి. తాజాగా.. ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన కీలక మ్యాచ్ లో హైదరాబాద్ విజయం సాధించినప్పటికీ.. ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపు మూసుకుపోయినట్టే అయింది. ఆశలు సజీవంగా ఉండాలంటే భారీ తేడాతో గెలవాల్సిన మ్యాచ్‌లో కేవలం మూడు పరుగుల తేడాతో నెగ్గడం ఆ జట్టు ఆశలను చిదిమేసింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. రాహుల్ త్రిపాఠి వీర విహారంతో 193 పరుగుల భారీ స్కోరు సాధించింది. తర్వాత ముంబై ఇండియన్స్‌ను 190 పరుగులకే కట్టడి చేసి ఆరో విజయాన్ని అందుకుంది. ముంబై స్కిప్పర్ రోహిత్ శర్మ ఎట్టకేలకు బ్యాట్ ఝళిపించినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. 36 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో రోహిత్ 48 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 34 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 43 పరుగులు చేశాడు.
టిమ్ డేవిడ్ అయితే హైదరాబాద్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. కేవలం 18 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 46 పరుగులు పిండుకున్నప్పటికీ.. చివరి వరుస బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోవడంతో పోరాడి ఓడింది ముంబై. మొత్తంగా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసి విజయం ముంగిట బోల్తా పడింది. ఇప్పటి వరకు 13 మ్యాచ్ లు ఆడిన ముంబైకి ఇది పదో పరాజయం కావడం గమనార్హం.
తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ విజయమే లక్ష్యంగా ఆడి 194 పరుగుల లక్ష్యాన్ని ముంబై ముంగిట పెట్టింది. ప్రియం గార్గ్, రాహుల్ త్రిపాఠీ, పూరన్ బంతిని పరుగులు పెట్టించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి.. 193 పరుగులు చేసింది. గార్గ్ 26 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 42.. పూరన్ 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 38 పరుగులు చేశారు. కాగా.. 44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 76 పరుగులు చేసి ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించిన రాహుల్ త్రిపాఠి కి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఎస్ఆర్‌హెచ్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్‌కు మూడు వికెట్లు తీసి టీం గెలుపుకు తన వంతు పాత్ర పోషించాడు. ముంబై బౌలర్లలో రమణ్‌దీప్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఐపీఎల్‌లో నేడు కోల్‌కతా నైట్ రైడర్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది.